
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. యడియూరప్పను తప్పించిన అనంతరం బీజేపీ అధిష్టానం బొమ్మైకి సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 19 నెలల 17 రోజుల పాటు బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు.
అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని బొమ్మై స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందనీ, దాని విజయానికి ప్రధాన కారణాలలో అది కూడా ఒకటి అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయనీ, ప్రజల ఆదేశాన్ని తాను చాలా గౌరవంగా స్వీకరిస్తున్నానని సీఎం తెలిపారు. బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తాననీ, మరెవరికీ బాధ్యత లేదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమికి వివిధ కారణాలు ఉన్నందున పూర్తి విశ్లేషణ చేస్తామని బొమ్మై అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పనితీరును కూలంకషంగా విశ్లేషిస్తామన్నారు ముఖ్యమంత్రి.
Also Read: కర్ణాటక ఫలితాలు.. జేడీఎస్, బీజేపీలకు పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ సత్తా.. కారణాలు ఇవేనా..?
అన్ని లోటుపాట్లను అధిగమించి, వ్యవస్థీకృతమై, పార్టీ మరోసారి పుంజుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. తమది జాతీయ పార్టీ అని, తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి సంస్థాగతంగా, పరిపాలనాపరంగా అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తామని బొమ్మై చెప్పారు. ఈ ఎన్నికలలో మోడీ, షా మంత్రం పని చేయలేదని మీడియా ప్రతినిధులు అడగగా.. ఈ పరిణామానికి అనేక కారణాలు ఉన్నాయని దాటవేశారు. క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దాని గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు. ఫలితాలు ఇంకా ఖరారు అవుతున్నాయనీ, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అని ఆయన పేర్కొన్నారు. తనను ఎన్నుకున్నందుకు షిగ్గావ్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బొమ్మై స్పష్టం చేశారు.