"దేశద్రోహి, చైనీస్ ఏజెంట్": సంజయ్ రౌత్ పై  భగ్గుమన్న కర్ణాటక సీఎం

By Rajesh KarampooriFirst Published Dec 23, 2022, 6:07 AM IST
Highlights

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్‭ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మధ్య మాటల తూటాలు పేలాయి

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినా.. ఇరు రాష్ట్రాల నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ వివాదం ముదురుతోంది. తాజాగా శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్‭ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మధ్య మాటల తూటాలు పేలాయి. చైనా భారత్‌లోకి ప్రవేశించినట్లే మనం (కర్ణాటక)లోకి ప్రవేశిస్తాం అని సంజయ్ రౌత్ అన్నారు. “చైనా [భారత భూభాగం]లోకి ఎలా ప్రవేశించిందో అలాగే మేము [కర్ణాటక]లోకి ప్రవేశిస్తాం. మాకు ఎవరి అనుమతి అవసరం లేదు.. చర్చ ద్వారా పరిష్కరించుకోవాలనుకున్నాం.కానీ కర్ణాటక సీఎం నిప్పులు చెరుగుతున్నారు. మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉంది. ఎవరూ దీనిపై  ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదు" అని సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు.  

ఈ ప్రకటనపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఘాటుగా స్పందించారు. సంజయ్ రౌత్ దేశ సమైక్యతను, సమగ్రతను పాడుచేస్తున్నాడని, ఆయన చైనాకు అనుకూలంగా ఉన్నారా అని, రౌత్ చైనా ఏజెంటులా మాట్లాడుతున్నారని, ఆయన దేశద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు. ఇలాగే మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బొమ్మై హెచ్చరించారు. ‘కర్ణాటకలోకి చైనా తరహాలో ఎంటర్ అవుతామంటూ’ వ్యాఖ్యానించడంపై తాము చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని బొమ్మై అన్నారు. చైనా లాగా అడుగుపెట్టాలని పట్టుపడితే.. భారత సైనికుల మాదిరిగానే కర్ణాటక కూడా స్పందిస్తుందని అన్నారు.

సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన గళం విప్పారు, సీఎం  షిండే తగినంత దృఢంగా లేరని ఆరోపించారు. రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏమి చెప్పారో తెలుసుకోవాలనుకుంటున్నాను. కర్నాటక ముఖ్యమంత్రి ఈ అంశంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారని, అయితే మా ముఖ్యమంత్రి భయంతో దాని గురించి మాట్లాడకూడదని ఆయన అన్నారు.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను -- పూర్వపు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెల్గావితో సహా -- కర్ణాటకలో చేర్చడంపై మహారాష్ట్ర కలత చెందింది. ఇది ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 814 మరాఠీ మాట్లాడే గ్రామాలపై దావా వేసింది.

click me!