2.25 లక్షల కోవిడ్ డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించిన బీమా సంస్థలు.. ఐఆర్డీఏ నివేదికలో సంచలన విషయాలు.. 

By Rajesh KarampooriFirst Published Dec 23, 2022, 4:32 AM IST
Highlights

కరోనా మహమ్మారి కారణంగా 2022 మార్చి వరకు బీమా కంపెనీలు 2.25 లక్షల మరణ క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయని  బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. యావత్తు ప్రపంచ దేశాలను కుదిపేసింది. ఈ మహమ్మారి ప్రభావం మనదేశంపై కూడా తీవ్రంగానే పడింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది రోడ్డునపడ్డారు. అయితే.. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలే కాదు.. బీమా కంపెనీలు ఆర్ధిక భరోసా నిచ్చాయి.

కోవిడ్ కారణంగా మరణించిన దాదాపు 2.25 లక్షల క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయని బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) తెలిపింది. ఈ మేరకు గురువారం వార్షిక నివేదిక విడుదల చేసింది. సాధారణ బీమా కంపెనీలు, స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు  కోవిడ్ చికిత్సకు సంబంధించి పెద్ద సంఖ్యలో క్లెయిమ్‌లను అందుకున్నాయని, మహమ్మారి ప్రభావాన్ని బీమా సంస్థలు  చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాయనీ, దాదాపు రూ. 25,000 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయని IRDA తెలిపింది.

నివేదికలోని డేటా ప్రకారం.. కోవిడ్ మహమ్మారికి సంబంధించి మొత్తం 26,54,001 ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు మహమ్మారి కారణంగా 2.25 లక్షలకు పైగా డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించాయని , మార్చి 31, 2022 వరకు క్లెయిమ్‌ల కోసం రూ.17,269 కోట్లు చెల్లించాయని ఐఆర్డీఏ తెలిపింది.

ఐఆర్డీఏ వార్షిక నివేదిక ప్రకారం.. జీవిత బీమా పరిశ్రమ 2021-22లో రూ. 5.02 లక్షల కోట్ల ప్రయోజనాలను చెల్లించింది. ఇది నికర ప్రీమియంలో 73.1 శాతం. చెల్లించిన మొత్తం ప్రయోజనాల్లో ఎల్‌ఐసీ వాటా 70.39 శాతం కాగా, మిగిలిన 29.61 శాతం ప్రైవేట్ బీమా సంస్థలది. వ్యక్తిగత జీవిత బీమా వ్యాపారం విషయానికొస్తే.. జీవిత పరిశ్రమ  డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 2021-22లో 98.39 శాతం నుండి 98.64 శాతానికి పెరిగింది.తిరస్కరణ నిష్పత్తి 1.14 శాతం నుండి 1.02 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది.

 2.19 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 

సాధారణ , ఆరోగ్య బీమా సంస్థలు 2.19 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిష్కరించాయనీ, ఆ  క్లెయిమ్‌ల పరిష్కారానికి రూ.69,498 కోట్లు చెల్లించాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,804 గా ఉంది. సాధారణ బీమా సంస్థల నికర క్లెయిమ్‌లు 2021-22లో రూ. 1.41 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది 2020-21లో రూ. 1.12 లక్షల కోట్లుగా ఉంది, ఇది దాదాపు 26 శాతం పెరిగింది.

click me!