భారీ వర్షాల ఎఫెక్ట్.. బెంగళూరులో నేడు స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు..

By Sumanth KanukulaFirst Published Sep 6, 2022, 10:26 AM IST
Highlights

కర్ణాటకలోని పలు జిల్లాలను వర్షం వెంటాడుతోంది. ముఖ్యంగా బెంగళూరులో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరులోని స్కూల్స్, కాలేజ్‌లనే నేడు మూసివేశారు. 

కర్ణాటకలోని పలు జిల్లాలను వర్షం వెంటాడుతోంది. ముఖ్యంగా బెంగళూరులో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారింది. చాలా మార్గాల్లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు నగరవాసులు ట్రాక్టర్లు, పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని స్కూల్స్, కాలేజ్‌లనే నేడు మూసివేశారు. 

బెంగళూరు అర్బన్ జిల్లాలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులతో సహా అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలకు మరియు ప్రీ-యూనివర్శిటీ కళాశాలలకు కూడా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. విద్యా సంస్థల నుండి అభిప్రాయాన్ని సేకరించిన అనంతరం అన్ని పాఠశాలలు, పీయూ కళాశాలలను మూసివేయాలని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ కె సిరినివాస  ఆదేశించారు. 

ఇక, బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. సోమవారం కూడా కొన్ని గంటల పాటు వర్షం పడింది.  మంగళవారం కూడా బెంగళూరులో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 6) పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకన్నాయి. వచ్చే వారం లేదా కనీసం వర్షాలు తగ్గేవరకు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించాలని కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. 

సర్జాపూర్‌లోని బిక్కనహళ్లి ప్రధాన రహదారిపై ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం హాస్టల్ భవనం, వర్సీటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గంలో వరదల కారణంగా తరగతులను రద్దు చేశారు. విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లోకి వెళ్లవద్దని యూనివర్సిటీ అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే.. తరగతులు పునఃప్రారంభం విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. 

భారత వాతావరణ శాఖ ప్రకారం.. బెంగళూరుతో పాటు కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా  వేసింది. 

click me!