వైద్యం పేరుతో నీచ ప్రవర్తన.. రహస్యంగా మహిళల వీడియోలు తీసిన థెరపిస్ట్..తాడిపత్రిలో పట్టుకున్న బెంగళూరు పోలీసులు

By Sumanth KanukulaFirst Published Nov 17, 2022, 10:59 AM IST
Highlights

ఆక్యుపంక్చర్ చికిత్స పేరుతో మహిళా పేషెంట్లను లైంగికంగా వేధించిన స్వయం ప్రకటిన థెరపిస్ట్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

ఆక్యుపంక్చర్ చికిత్స పేరుతో మహిళా పేషెంట్లను లైంగికంగా వేధించిన స్వయం ప్రకటిన థెరపిస్ట్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితుల వరుస ఫిర్యాదుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో తలదాచుకున్న నిందితుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మత్తికెరెకు చెందిన వెంకటరమణ ఆక్యుపంక్చర్ థెరపిస్టుగా చెప్పుకుంటున్నాడు. మత్తికెరెలోని తన నివాసానికి సమీపంలో ఆక్యుపంక్చర్ కేంద్రాన్ని తెరిచాడు. వెంకటరమణ అంతకు ముందు పదేళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేశాడు. అయితే కుటుంబ విబేధాల కారణంగా.. అతని భార్య, కూతురు అతనికి దూరంగా ఉంటున్నారు. 

అయితే కొంతకాలం కిందట వెంకటరమణ ఆక్యుపంక్చర్ గురించిన సెషన్‌కు హాజరయ్యాడు. ఆ సెషన్‌ తర్వాత  అతను జయనగర్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఆక్యుపంక్చర్‌పై రెండేళ్ల కోర్సులో చేరాడు. అది పూర్తయిన తర్వాత తన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి క్లినిక్‌ని ప్రారంభించాడు. నాలుగు సంవత్సరాల నుంచి అతను పేషెంట్ల ఆక్యుపంక్చర్ థెరపీని అందిస్తున్నాడు. ఆక్యుపంక్చర్ సెషన్ సాకుతో మహిళా రోగులను  లైంగికంగా వేధించడం, వారికి తెలియకుండా వీడియోలను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. 

అక్టోబరు 30న నగరానికి చెందిన 41 ఏళ్ల గృహిణి తనను వెంకటరమణ రహస్యంగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ యశ్వంత్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. ‘‘నా వాపు కాలుకు చికిత్స పొందేందుకు నేను వెంకటరమణ క్లినిక్‌కు వెళ్లాను. మత్తికెరెలోని అతని క్లినిక్‌కి సుమారు 20 సార్లు సందర్శించినప్పుడు.. అతను నా శరీరమంతా ప్రైవేట్ భాగాలతో సహా పిన్నులను చొప్పించాడు. శరీరమంతా పిన్‌లు వేయడం అవసరమని అతను చెప్పాడు. 

అక్టోబర్ 26న నాకు మరో మహిళ నుంచి వాట్సాప్‌లో వీడియో వచ్చింది. పంపిన మహిళ కూడా వెంకటరమణ వద్ద చికిత్స చేయించుకున్న వ్యక్తే. అయితే ఆమెకు చికిత్స చేస్తున్నప్పుడు వీడియో తీయాలని ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెను నమ్మించేందుకు, ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా ఉండేందుకు.. వెంకటరమణ నా వీడియోను ఆమెతో పంచుకున్నాడు. దీంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ మహిళ.. నా మొబైల్‌ నెంబర్‌ను సేకరించింది. వీడియోను షేర్ చేసింది. నువ్వు దానికి సమ్మతించావా అని నన్ను అడిగింది. దీంతో అప్పుడే నేను ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను’’ ఆమె పోలీసులకు తెలిపింది. మరో మహిళ కూడా తన కూతురును చికిత్స పేరుతో వీడియో తీశారని బసవనగుడి మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పొందేందుకు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. బుధవారం సీసీబీ పోలీసులు అతడిని బెంగళూరులోని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం 15 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడు. వెంకటరమణ మొబైల్ ఫోన్ నుంచి పలు చిత్రాలు, క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను పెద్ద సంఖ్యలో వీడియోలు, ఫొటోలను తొలగించినట్టుగా అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిపై లైంగిక వేధింపులతోపాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అతని క్లినిక్‌కు లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

click me!