Bandi Sanjay Biography: తెలంగాణ ప్రజానీకానికి పరిచయం అవసరంలేని నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
Bandi Sanjay Biography: నమ్మిన సిద్దాంతాలనే ఆచరణలో పెట్టే వ్యక్తి.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనకడుగు వెయ్యని నేత.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. ఓ సామాన్య కార్యకర్త గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. కాషాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ రేసులో ఎంతోమంది సీనియర్ నేతల ఉన్న అతడే సరైనోడని పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ పీఠాన్ని అధిరోహించిన రోజులు.. తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆలోచింపజేశారు. ఆయనే బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. బండి సంజయ్ భార్య అపర్ణ (aparna). వారికి ఇద్దరు కుమారులు. భార్య అపర్ణ బ్యాంకు ఉద్యోగి.
బండి సంజయ్ బాల్యం
బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్ లో జన్మించారు. బి.నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్ (karimnagar) లోని సరస్వతి శిశుమందిర్ లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. ఆయన ఘటన్ నాయక్‌గా,ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్ లోనే సాగింది. ఆ తరువాత 2014లో తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్శిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (abvp)లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇంచార్జీగా కూడ ఆయన పనిచేశారు. మరో వైపు భారతీయ జనతా యువమోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994-2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ (LK Advani) యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు.
2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పోరేటర్ గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పోరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిథ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.2019 మే 23 నుండి కరీంనగర్ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ, సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తరువాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2023 లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు.
బండి సంజయ్ వివాదాలు
SSC పేపర్ లీక్ కేసులో ప్రమేయం: SSC పేపర్ లీక్ కేసులో 2023లో ఆయన జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కానీ, స్పష్టమైన కారణాలు లేక నిర్థోషిగా విడుదల చేశారు.
COVID-19 నిబంధనల ఉల్లంఘన: జనవరి 2022లో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడినందుకు అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాలు, బదిలీల కేటాయింపులో జోనల్ వ్యవస్థను పేర్కొన్న ప్రభుత్వ జిఓ 3317 నిబంధనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'జాగరణ' నిరసన (రాత్రిపూట జాగారం) చేపట్టినప్పుడు అతన్ని రిమాండ్‌కు తరలించారు.
బండి సంజయ్ కుమార్ బయోగ్రఫీ..
పేరు: బండి సంజయ్ కుమార్
జననం: జూలై 11, 1971
తల్లిదండ్రులు: నర్సయ్య, శకుంతల
జీవిత భాగస్వామి: అపర్ణ
పిల్లలు: సుముఖ్,భగీరథ్
జాతీయత: భారతీయుడు
పార్టీ: బీజేపీ
హోదా: పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్
విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్
చిరునామా: H No 2-10-1525(NEW),జ్యోతినగర్,కరీంనగర్.