పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ సిఎఎ పై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సిఎఎ గురించి తెలుసుకుందాం.
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమ్మలోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి(సోమవారం) నుండి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుందని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారత పౌరసత్వానికి సంబంధించిన ఈ చట్టంపై దేశప్రజల్లో అనేక అనుమానాలు వున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ సిఎఎ?ఎందుకు దీనిపై వివాదం సాగుతోంది? పార్లమెంట్ ఎన్నికలు ముందే ఈ చట్టాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? తదితర విషయాలను తెలుసుకుందాం.
కేంవ్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఇతర దేశాలనుండి వలసవచ్చిన ముస్లిం మతేతరుకు భారత పౌరసత్వం దక్కనుంది. సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్ లలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది భారత్ కు వస్తున్నారు. ఇలా భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లీమేతర వర్గాలవారికి భారత పౌరసత్వం కల్పించేందుకు తీసుకువచ్చిందే ఈ సిఎఎ చట్టం.
భారత పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో ఇతర దేశాలనుండి భారత్ కు వచ్చిన హిందూ, సిక్కు, జైన, బుద్దిస్ట్, పార్సి మరియు క్రైస్తవులకు ఊరట లభించనుంది. డిసెంబర్ 31, 2014 లోపు భారత్ కు వచ్చిన ముస్లీమేతర కులాలవారికి భారత పౌరసత్వం లభించనుంది. ఎలాంటి అనుమతి లేకుండా దేశంలో నివాసముంటున్న వారికి ఈ చట్టం ద్వారా పౌరసత్వం లభించనుంది.
2019 డిసెంబర్‌లోనే పౌరసత్వ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 2020 జనవరి 10న ఇది అమలుకు సిద్ధమైంది. కానీ ఇప్పటి వరకు ఈ చట్టాన్ని నోటిఫై చేయలేదు. అందుకే ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ రోజు వివాదాస్పదమైన ఈ సీఏఏను కేంద్ర హోం శాఖ నోటిఫై చేయడంతో ఆమోదం లభించింది.
సిఎఎకు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మత ప్రాతిపదికన దేశ పౌరసత్వాన్ని కల్పించడాన్ని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనను అదుపుచేసేందుకు పోలీసులు చేపట్టిన చర్యల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ ఈ చట్టం అమలు విషయంలో వెనక్కితగ్గని మోదీ సర్కార్ తాజాగా అమలుచేసింది.
పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) సంబంధించిన కీలక విషయాలు :
అసలు ఏమిటీ పౌరసత్వ చట్టం?
1955 భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించారు. దీంట్లో పుట్టుక, సంతానం, ఇతర భూభాగాల వీలీనం ఇతరత్రా మార్గాల ద్వారా భారత పౌరసత్వాన్ని ఎలా కల్పించాలో ఓ చట్టంలో పొందుపర్చారు. అలాగే పౌరసత్వం తొలగింపు గురించి కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు.
మరి ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏమిటి?
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. 2019 లో ఈ చట్టాన్ని పార్లమెంట్ తో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. మన చుట్టుపక్కల దేశాల్లోని ఆరు మైనారిటీ మతాలవారు (ముస్లీమేతరులు) వివిధ కారణాలతో భారత్ కు వలస వస్తున్నారు. వారికి భారత పౌరసత్వాన్ని కల్పించాలన్నదే ఈ సిఎఎ ఉద్దేశం.
సిఎఎ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందేందుకు అర్హులెవరు?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురవుతూ అనేకమంది ముస్లీమేతరులు భారత్ కు వలస వస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇలా ఇతర దేశాలనుండి వచ్చిన హిందూ, సిక్కు, జైన, బుద్దిస్ట్, పార్సి, క్రిస్టియన్లు సిఎఎ చట్టం ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అయితే డిసెంబర్ 31, 2014 కు ముందు భారత్ కు వచ్చినవారికే భారత పౌరసత్వం కల్పించనున్నారు.
సిఎఎ భారతీయులపై ప్రభావం చూపుతుందా?
పౌరసత్వ సవరణ చట్టం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రం చెబుతోంది. ముస్లీంలు ఈ చట్టాన్ని చూసి బయపడవద్దని చెబుతున్నారు.
హిందూ, సిక్కు, జైన, బుద్దిస్ట్, పార్సి మరియు క్రిస్టియన్ వలసదారులకు సిఎఎ ద్వారా లాభమేంటి?
సిఎఎ ద్వారా భారత పౌరులుగా మారే ఈ మతాలవారికి సగటు భారతీయుడికి వున్న అన్ని హక్కులు లభిస్తాయి. చట్టపరంగా వీరంతా భారతీయులే... వీరికి అన్నిరకాల సదుపాయాలు లభిస్తాయి.
హిందూ, సిక్కు, జైన, బుద్దిస్ట్, పార్సి మరియు క్రిస్టియన్ మతాలవారికి కాకుండా ఇతర మతాల విదేశీయులకు ఈ చట్టం వర్తిస్తుందా?
కేవలం హిందూ, సిక్కు, జైన, బుద్దిస్ట్, పార్సి మరియు క్రిస్టియన్ మతాలవారికే ఈ సిఎఎ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుంది. అదికూడా పాకిస్ధాన్, బంగ్లాదేశ్ మరియు అప్ఘానిస్థాన్ దేశాలనుండి వలసవచ్చిన వారికి మాత్రమే ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుంది.
మతపరమైన హింసకు గురవుతున్న ఇతర దేశాలకు చెందినవారు కూడా సిఎఎ ద్వారా భారత పౌరసత్వ పొందవచ్చా?
లేదు. కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ కు చెందిన మైనారిటీలే సిఎఎ ద్వారా భారత పౌరసత్వం పొందుతారు. ఇతర దేశాలకు చెందినవారికి ఇది వర్తించదు.
కేవలం ఎందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్,అప్ఘానిస్థాన్ మైనారిటీలకే సిఎఎ?
భారత సరిహద్దు దేశాల్లో మతపరమైన హింస జరుగుతోందని కేంద్ర గుర్తించింది. ఇలా పాక్, బంగ్లా, అప్ఘాన్ లలో హింసింపబడుతున్న మైనారిటీలు భారత్ కు అధికంగా వలస వస్తున్నారు. అందువల్లే ఈ దేశాలకు చెందిన హిందువలతో పాటు మరికొన్ని వర్గాలకు అండగా నిలిచేందుకే సిఎఎ తీసుకువచ్చారు.
ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా భారత పౌరసత్వం కల్పించబడిందా?
అవును. శ్రీలంక నుండి వలసవచ్చిన తమిళులు, బర్మా, ఉగాండ నుండి వలసవచ్చిన వారికి కూడా గతంలో భారత పౌరసత్వం కల్పించారు.