
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోగా, 1175 మందికి పైగా గాయపడ్డాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు ఇటీవల ముగ్గురు రైల్వే ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. ఇదిలాఉంటే, తాజాగా ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు.. కనీసం ఏడుగురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏడుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీబీఐ ఇప్పటి వరకు ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేసింది. ప్రస్తుతం డ్యూటీ సమయంలో అప్రమత్తంగా ఉండని స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, మెయింటెయినర్ సహా 7 మందిని సస్పెండ్ చేశారు. వారు అప్రమత్తంగా ఉంటే.. రైలు ప్రమాదాన్ని నివారించి ఉండేవారు’’ అని తెలిపారు.
ఇక, ఆగ్నేయ రైల్వే కొత్త జనరల్ మేనేజర్‌గా అనిల్ కుమార్ మిశ్రా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ కుమార్ మిశ్రా, డీఆర్ఎం బుధవారం బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్‌లను సందర్శించిన వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ రావడం గమనార్హం. అలాగే ఎంపీ ప్రతాప్ సారంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు.
మరోవైపు ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసినవారిలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లు ఉన్నారు. వారిని సీబీఐ మరో నాలుగు రోజుల రిమాండ్‌కు తీసుకుంది. ఇక, ఈ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్(ట్రాఫిక్) విభాగాలదే బాధ్యతని రైల్వే భద్రతా కమిషనర్ రైల్వే బోర్డుకు నివేదించారు.