మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎట్టకేలకు రాందేవ్ బాబా క్షమాపణలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

By Rajesh KarampooriFirst Published Nov 28, 2022, 6:25 PM IST
Highlights

యోగా గురు స్వామి రామ్‌దేవ్ మహిళలపై సెక్సిస్ట్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన మూడు రోజుల తర్వాత విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్‌కు రామ్‌దేవ్ ఇమెయిల్ పంపారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రామ్‌దేవ్ అన్నారు. స్త్రీలను అవమానించడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

మహిళల వస్త్రధారణపై యోగా గురు రామ్‌దేవ్‌ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగంగా క్షమపణలు చెప్పాలని, తనపై క్రిమినల్ కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లివిరిశాయి. మహిళలంటే.. అతనికి మహిళలంటే.. అంత చులకన భావన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రామ్‌దేవ్ అన్నారు.
తన వ్యాఖ్యలతో ఎవరైన కలత చెందితే.. క్షమించాలని కోరారు.ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్‌కు రామ్‌దేవ్ ఇమెయిల్ పంపారు. 

ఇంతకీ ఏం జరిగింది..? 

గత శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మహిళల కోసం యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యోగా గురు రామ్‌దేవ్ బాబాతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా సహా ఇతర  పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ..మహిళలు చీరల్లో,సల్వార్ సూట్‌లలో అందంగా కనిపిస్తారని అన్నారు. అంతటితో ఆగకుండా తన లాగా అసలేం ధరించకపోయినా.. అందంగా కనిపిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.  మహిళల ఆగ్రహం పెల్లుబిక్కడంతో తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాందేవ్ బాబా స్పందించారు. మహిళలకు గౌరవం, సమానత్వం కోసం తాను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశానని అన్నారు.

బేటీ బచావో, బేటీ పడావో వంటి ప్రభుత్వ విధానాలకు తాను మద్దతునిచ్చాననీ, తాను ఏ స్త్రీని అగౌరవపరచలేదని లేదా అలా చేయాలని ఉద్దేశించలేదని తనకు ఏ మాత్రం లేదని అన్నారు. తన మాటలను  తప్పుగా చూపించారని ఆరోపించారు. తనకు మాతృశక్తి అంటే చాలా గౌరవమనీ, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే.. దానికి తీవ్రంగా చింతిస్తున్నాననీ, తాను వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మహిళా కమిషన్ అధికారులు ఈ అంశాన్ని క్లోజ్‌గా పరిగణిస్తామని, అయితే ఏవైనా ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని సూచించారు. ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్‌కు రామ్‌దేవ్ ఇమెయిల్ పంపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మహిళ కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

click me!