అదానీ సీపోర్టు: పోలీసులపై ఆందోళనకారుల దాడి.. 3,000 మందిపై కేసు నమోదు

By Mahesh KFirst Published Nov 28, 2022, 6:22 PM IST
Highlights

కేరళలో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న సీపోర్టును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శనివారం నాటి హింసాత్మక ఘర్షణల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలని ఆదివారం నిరసనకారులు పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడి తర్వాత పోలీసులు 3,000 మందిపై కేసు నమోదు చేశారు.
 

తిరువనంతపురం: కేరళ పోలీసులు సోమవారం కనీసం 3,000 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని విజింజామ్ పోలీసు స్టేషన్ పై దాడి చేసినందుకు వీరిపై కేసు నమోదైంది. శనివారం నాటి ఆందోళనలను అదుపులోకి తేవడానికి కొందరు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలని ఆందోళనకారులు ఏకంగా పోలీసు స్టేషన్ పైనే దాడి చేశారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు.

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న సీపోర్టును స్థానికులు, ముఖ్యంగా క్రైస్తవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సీపోర్టు ద్వారా తాము నివసిస్తున్న ప్రాంతాలు కోతకు గురవుతున్నాయని, తమ జీవించే హక్కునే ఈ సీపోర్టు హరించి వేస్తున్నదని ఆందోళనకారులు చెబుతున్నారు. ఈ సీపోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా వారు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కారణంగా మూడు నెలలుగా ఇక్కడ పనులు నిలిచిపోయాయి. కానీ, కోర్టు ఆదేశాలతో గతవారం 900 మిలియన్ డాలర్ల ట్రాన్స్‌షిప్‌మెంట్ ప్రాజెక్టు నిర్మాణపనులు పున:ప్రారంభం అయ్యాయి.

Also Read: 2050 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ : గౌతం అదానీ

ఈ ప్రాజెక్టు నిర్మాణాలకు ఎంట్రెన్స్ దగ్గర ఆందోళనకారులు ఒక పెద్ద షెల్టర్‌ను నిర్మించారు. తద్వారా ఆ ప్రాజెక్ట్ ఎంట్రెన్స్‌ను బ్లాక్ చేశారు. ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణాలను అడ్డగిస్తూ స్థానికులు ఆందోళనలు చేస్తుండగా సీపోర్టు వైపు నుంచి కూడా వీరికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే ఉభయ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. కానీ, ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో సామాన్యులు సహా పోలీసులూ (సుమారు 40 మంది) గాయపడ్డారు.

శనివారం నాటి ఘర్షణలతో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని విడుదల చేయాలని ఆదివారం మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. వారు పోలీసు స్టేషన్ పైనే దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో పోలీసులు 3,000 మందిపై కేసు నమోదు చేశారు.

ఈ దాడిలో రూ. 85 లక్షల నష్టం జరిగినట్టు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

click me!