జర్మనీలో రోజుకు 3 లక్షల కేసులు.. యూకే, యూఎస్‌లోనూ పైపైకి.. భారత్‌లోనూ కేసులు పెరగొచ్చా?

Published : Mar 27, 2022, 05:14 PM IST
జర్మనీలో రోజుకు 3 లక్షల కేసులు.. యూకే, యూఎస్‌లోనూ పైపైకి.. భారత్‌లోనూ కేసులు పెరగొచ్చా?

సారాంశం

ఐరోపా దేశాలు, చైనా, దక్షిణ కొరియా, యూకే, యూఎస్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ కేసులకు ప్రధాన కారకంగా బీఏ.2 అంటే ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్  కారణంగా ఉన్నది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ పంజా విసురుతున్నది. ఈ నేపథ్యంలోనే బీఏ.2 వేరియంట్ లేదా స్టెల్త్ ఒమిక్రాన్ ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్నది.

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2 సబ్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్నది. ఐరోపా దేశాలు, యూకే, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ వేగంగా వ్యాపిస్తున్నది. అమెరికాలోనూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల వెనుక బీఏ.2 సబ్ వేరియంట్ ఉన్నట్టు స్పష్టం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ మళ్లీ ఫోర్త్ వేవ్ రానుందా? మళ్లీ కేసులు పెరగనున్నాయా? అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

బీఏ.2 సబ్ వేరియంట్ లేదా స్టెల్త్ ఒమిక్రాన్ ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లో వారం వారీగా చూస్తే హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కాగా, జర్మనీలో కొత్త కేసులు అమాంతం పెరిగిపోయాయి. అక్కడ సింగిల్ డేలో సుమారు 3 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే ఇక్కడ 3 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో శుక్రవారం, శనివారాల మధ్య 1.5 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి. గురువారం 81 వేల కేసులు నమోదయ్యాయి.

యూకేలో కేసులు రికార్డులు సృష్టించడానికి దగ్గరలో ఉన్నాయి. స్కాంట్లాండ్, వేల్స్ దేశాల్లో ఆల్ టైమ్ హై రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లాండ్‌లోనూ కొత్త కేసులు రికార్డులకు చేరువ అవుతున్నాయి. యూకేలో చివరి వారంలో 42 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. 2022 తొలి వారంలో 43 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి.

అమెరికాలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అవి కూడా బీఏ.2 వేరియంట్ ఈ పెరుగుదల వెనుక ఉన్నట్టు వివరించారు. ప్రస్తుతం అమెరికాలో ఇంచు మించు ఒక రోజుకు 28,600 కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఇక్కడ రోజుకు 8 లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే, న్యూయార్క్ రాష్ట్రం, న్యూయార్క్ నగరంలో హాస్పిటళ్లలో చేరుతున్న కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాచెల్లి వాలెన్‌స్కీ అన్నారు.

పలు దేశాల్లో బీఏ.2 వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న తరుణంలో భారత్‌లోనూ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది. ఆ దేశాల్లో కేసులు పెరుగుదల ప్రభావం ఇండియాపై ఉంటుందా? అనే ఆందోళనలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా ఉన్నాయి. యాక్టివ్ కేసులూ కనిష్టంగా అంటే 16,187గా ఉన్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లో ఈ కేసులు 0.4 శాతంగా ఉన్నాయి. 98.75 రికవరీ రేటు ఉన్నది.

మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యలో కేసులు భారీగా రిపోర్ట్ అయ్యాయి. జనవరి చివరలో, ఫిబ్రవరిలో రిపోర్ట్ ఐన ఎక్కువ కేసుల్లో బీఏ.2 లీనియెజ్ కేసులే ఉండటం గమనార్హం. అంటే.. ఇతర దేశాల్లో ఇప్పుడు బీఏ.21 వేరియంట్ కేసులు ఉధృతంగా రిపోర్ట్ అవుతున్నప్పటికీ.. మన దేశంలో ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అదుపులోకీ వచ్చాయి. కాబట్టి, ఈ వేరియంట్‌తో భారత్‌కు ముప్పు తక్కువేనిని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ వేరియంట్‌ సోకి దాన్ని ఎదుర్కొనే సహజ శక్తిని చాలా మంది భారతీయులు కలిగి ఉండటం, అలాగే, వ్యాక్సినేషన్ కూడా విస్తృతంగా జరగడం కారణాలుగా ఉంటాయని వివరిస్తున్నారు. 

అయితే, అంతటితో ఇక ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశమే లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ప్రమాదకారిక వేరియంట్లు చాలా ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని చోట్ల ఇప్పుడు ఒకటే వేరియంట్ ఉన్నదని చెప్పలేం. కాబట్టి, ఒమిక్రాన్‌లోనే మరిన్ని వేరియంట్లు రావొచ్చని, లేదా ఇది వరకే ప్రమాదకారికి వేరియంట్లుగా ఉన్న వాటిలోనూ కొత్తగా ఉప వేరియంట్లు అభివృద్ధి చెందే ముప్పూ లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, కరోనా జాగ్రత్తలపై మాత్రం అలసత్వం వహించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు చేస్తున్నది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !