పంబా ఉధృతి: శబరిమలకు రావద్దని భక్తులకు సూచన

By sivanagaprasad KodatiFirst Published Aug 22, 2018, 3:43 PM IST
Highlights

 కేరళ రాష్ట్రాన్ని రెండు వారాలపాటు కుదిపేసిన భారీ వర్షాలు, వరదలకు ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమల పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలకు పంబానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శబరిమల అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. శబరిమల రహదారులన్నీ జలమయమయ్యాయి. కేరళలో ప్రకృతి భీభత్సం సృష్టించిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రం రహదారులు ఛిన్నాభిన్నంగా మారాయి. 

కేరళ: కేరళ రాష్ట్రాన్ని రెండు వారాలపాటు కుదిపేసిన భారీ వర్షాలు, వరదలకు ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమల పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలకు పంబానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శబరిమల అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. శబరిమల రహదారులన్నీ జలమయమయ్యాయి. కేరళలో ప్రకృతి భీభత్సం సృష్టించిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రం రహదారులు ఛిన్నాభిన్నంగా మారాయి. 

రహదారులు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు కుప్పకూలిపోవడంతో కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో అటవీశాఖ అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే పంబావ్యాలీ దగ్గర ఓ మృతదేహం కొట్టుకు రావడంతో అధికారులు ఆ మృతదేహాన్ని వెలికితీశారు. భక్తులు శబరిమల రావొద్దని అధికారులు సూచించారు.

శబరిమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం.

శబరిమల అనగానే ప్రకృతి అందాలకు నెలవుగా.... ఆధ్మాత్మిక క్షేత్రంగా నిత్యం భక్తుల పూజలందుకునే దివ్యక్షేత్రం శబరిమల పుణ్యక్షేత్రం. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి తెలుగు ప్రజలకు ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతీ ఏడాది అయ్యప్ప సన్నిధానానికి వెళ్లే భక్తుల్లో తెలుగువారే ఎక్కువగా ఉండటమే అందుకు నిదర్శనం. వర్షాకాలంలో మండల దీక్ష పూర్తి చేసుకుని ఇడుముళ్ల కోసం కేరళ వెళ్లే భక్తులు పంబానది మీదుగా కొండ, కోనలు ధాటి స్వామిని దర్శనం చేసుకుంటారు. వరదలు సృష్టించిన మహా ప్రలయం శబరిమల భక్తుల పాలిట శాపంగా మారింది. 

మాలధారణ సమయంలోనే కాకుండా అన్నిరోజుల్లో అయ్యప్పస్వామి భక్తుల పూజలందుకుంటాడు. నిత్యం ఈ మార్గం... స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల నినాదంతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మార్మోగుతుంది. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు స్వామి శరణం అయప్ప శరణం అంటూ శబరిగిరికి చేరుకుని స్వామిని శరణు వేడుకుంటారు. మాలధారణ సమయంలో అయితే ఈ ప్రాంతం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుంది. ఈ దివ్యక్షేత్రం అంతా స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మార్మోగిపోతుంది.  

అయితే కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో శబరిమల వెళ్లే రహదారులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి.  వాహనాలు వెళ్లలేని పరిస్థితి...కాలినడకన కూడా స్వామిని దర్శించుకులేని పరిస్థితి. శబరిమల ఆధ్యాత్మిక క్షేత్రం చేరుకోవాలంటే పతనంతిట్టా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో 85 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే శబరిమల క్షేత్రం దర్శనమిస్తుంది. ఆ దట్టమైన అటవీప్రాంతంలో అయ్యప్ప సన్నిధానం 18వ కొండపై ఉంటుంది. 

శబరిమల వెళ్లాలంటే రెండు మార్గాలు ఉంటాయి...ఒకటి త్రివేణి బ్రిడ్జ్ గుండా....రెండు అడవిలో నుంచి కాలినడకన. అంతకుముందు పతనంతిట్టా జిల్లా కేంద్రం నుంచి 80 కిలోమీటర్లు దాటి పంబానది దగ్గరకు చేరుకుంటారు. ఈ నది దాటకుండా శబరిమల వెళ్లలేరు. అయితే పంబానది ఉప్పొంగి ప్రవవిస్తుండటంతో త్రివేణి బ్రిడ్జ్ దాదాపుగా దెబ్బతింది. త్రివేణి బ్రిడ్జ్ వరకు కూడా వెళ్లలేని పరిస్థితి. కాలినడకన వెళ్దామంటే భారీ వృక్షాలు కుప్ప కూలిపోవడంతో ఆమార్గం గుండా వెళ్లలేని పరిస్థితి. ఇకపోతే రహదారులు వరద నీటికి కొట్టుకుపోయాయి. దీంతో కేరళ అటవీశాఖ రహదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.   
 
శబరిమల యధాస్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానం ప్రకటించింది. శబరిమలలో నేటికి విద్యుత్ లేదు....ఫోన్ సౌకర్యం లేదు...భక్తులకు ఉపయోగించే వసతి గృహాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. అందువల్ల భక్తులు ఎవరు శబరిమల రావొద్దని దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. 

పంబానది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ఉపధృవం సంభవిస్తుందో అంచనా వేయలేకపోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకా వర్షం కురుస్తుండటంతో భక్తులు రావొద్దని సూచించింది. 
  

ఈ వార్తలు కూడా చదవండి

కేరళలో తగ్గుముఖం పట్టిన వరదలు: ఇళ్లలోకి చేరిన పాములు, మొసళ్లు

click me!