సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం చెలారేగింది. ఈ తరుణంలో అయోధ్య స్వామీజీ, జగద్గురు పరమహంస ఆచార్య కూడా ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వ్యక్తికి 10 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించారు. ఈ ప్రకటనతో జగద్గురు పరమహంస ఆచార్య పై కేసు నమోదైంది.
'సనాతన ధర్మం'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హత్య బెదిరింపులు జారీ చేశారన్న ఆరోపణలపై అయోధ్య స్వామీజీ పరమహంస ఆచార్యపై బుధవారం పోలీసు కేసు నమోదైంది .తమిళనాడులో భయాందోళనలను వ్యాపింపజేసి, ఉదయనిధి స్టాలిన్‌ను బెదిరించినట్లు ఆరోపించిన వీడియోను షేర్ చేయడం ద్వారా మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసాడంటూ స్వామీజీ ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.
వాస్తవానికి .. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ దుమారం చెలారేగింది. మంత్రి ఉదయనిధి .. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన కామెంట్స్‌ని అయోధ్య స్వామీజీ పరమహంస ఆచార్య తప్పుపడుతూ.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వాళ్లకు 10కోట్ల రూపాయలు ఇస్తానంటూ వివాదాస్పద ప్రకటన చేశారు.
అంతటితో ఆగని ఆ స్వామీజీ ఈ క్రమంలో డీఎంకే మంత్రి ఫోటోను కత్తితో చింపివేయడం, తరువాత ఫోటోను కాల్చడం చేశారు. ఇదిలా ఉంటే.. మరుసటి రోజు మరో సంచలన ప్రకటన చేశారు. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి శిరచ్చేదం చేయడానికి 10 కోట్ల రూపాయలు చాలకపోతే మరికొంత ఇస్తానంటూ ప్రకటించారు.
ఈసంచలన ప్రకటనతో పాటు సనాతన ధర్మాన్ని అవమానించే వారిని ఏమాత్రం సహించేది లేదన్నారు. దేశంలో ఏ అభివృద్ధి జరిగినా.. దానికి మూలాలు సనాతన ధర్మమేనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఉదయనిధి తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఉదయనిధిని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని అయోధ్య స్వామీజీ పరమహంస ఆచార్య డిమాండ్ చేశారు. ఈ తరుణంలో డీఎంకే కార్యకర్త ఫిర్యాదు మేరకు మధురై సిటీ సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసింది. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.