అయోధ్య రామ మందిరంతో 1.2 లక్షల ఉద్యోగాలు.. IIM లక్నో ఆసక్తికర రిపోర్ట్

Published : Feb 17, 2026, 09:36 PM IST
Ayodhya

సారాంశం

శ్రీరామ మందిరం నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులు వచ్చాయి. పర్యాటకం, పెట్టుబడులు, హోటల్ పరిశ్రమ, ఉపాధి అవకాశాలు ఎలా పెరిగాయో వివరిస్తూ IIM లక్నో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లోని కీలక విషయాలు ఇవే.

ఒకప్పుడు అయోధ్య అంటే కేవలం ఒక పుణ్యక్షేత్రం. ఇరుకైన వీధులు, చిన్న మార్కెట్లు, పండగలప్పుడు మాత్రమే కనిపించే వ్యాపారాలు... ఇదే అక్కడి ఆర్థిక పరిస్థితి. కానీ రామ మందిరం నిర్మాణం, 2024 జనవరిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ తర్వాత నగరం రూపురేఖలే మారిపోయాయి. ఈ మార్పుపై ఇప్పుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లక్నో (IIM) ఒక అధ్యయనం చేసింది. "ఎకనామిక్ రెనైసాన్స్ ఆఫ్ అయోధ్య" పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్, గణాంకాలతో సహా అక్కడి మార్పులను కళ్లకు కట్టింది.

సరైన ప్రణాళిక, పెట్టుబడులు, ప్రభుత్వ సహకారం ఉంటే... ఒక పుణ్యక్షేత్రం ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా పనిచేస్తుందని ఈ రిపోర్ట్ చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అభివృద్ధి చేసిన 'టెంపుల్ ఎకానమీ మోడల్' దీనికి చక్కటి ఉదాహరణ అని రిపోర్ట్ పేర్కొంది.

 మందిరానికి ముందు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది?

మందిర నిర్మాణానికి ముందు అయోధ్యకు ఏటా సుమారు 1.7 లక్షల మంది యాత్రికులు మాత్రమే వచ్చేవారని IIM అధ్యయనం తెలిపింది. స్థానిక దుకాణదారుల రోజువారీ సగటు ఆదాయం ₹400 నుంచి ₹500 మధ్య ఉండేది. దేశంలో పేరున్న పెద్ద హోటల్స్ అక్కడ ఒక్కటి కూడా లేవు. రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు మాత్రమే ఉండేవి. విమానాశ్రయం లేకపోవడం రాకపోకలకు పెద్ద అడ్డంకిగా ఉండేది.

ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగపడేది కాదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా నిస్తేజంగా ఉండేది.

ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆర్థికంగా దూకుడు

2024 జనవరిలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రిపోర్ట్ ప్రకారం, మొదటి ఆరు నెలల్లోనే 11 కోట్లకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారు. ఇకపై ఏటా 5 నుంచి 6 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు.

సుమారు ₹85,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునిక రైల్వే స్టేషన్, విస్తరించిన రోడ్ల నెట్‌వర్క్, నగర సుందరీకరణ పనులు అయోధ్య స్వరూపాన్నే మార్చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి వినియోగం ద్వారా అయోధ్యను 'మోడల్ సోలార్ సిటీ'గా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

పర్యాటకం, ఆదాయంలో కొత్త శకం

2025 నాటికి ఉత్తరప్రదేశ్‌లో పర్యాటక వ్యయం ₹4 లక్షల కోట్లు దాటవచ్చని, ఇందులో అయోధ్య కీలక పాత్ర పోషిస్తుందని రిపోర్ట్ అంచనా వేసింది. పర్యాటకం ఆధారిత కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం ₹20,000 నుంచి ₹25,000 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, మందిర ప్రాణప్రతిష్ఠ వల్ల దేశవ్యాప్తంగా ₹1 లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఇందులో అయోధ్య వాటా చాలా ఎక్కువ. రోజూ రెండు లక్షలకు పైగా భక్తులు వస్తుండటంతో హోటల్స్, రవాణా, సేవా రంగాలకు కొత్త ఊపు వచ్చింది.

హోటల్ రంగంలో పెట్టుబడుల వెల్లువ

ఐఐఎం రిపోర్ట్ ప్రకారం, ఇప్పటికే 150కి పైగా కొత్త హోటళ్లు, హోమ్‌స్టేలు ఏర్పాటయ్యాయి. తాజ్ హోటల్స్, మారియట్ ఇంటర్నేషనల్, విండ్‌హామ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అయోధ్యలో తమ బ్రాంచ్‌లను విస్తరించే ప్రణాళికలను ప్రకటించాయి. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో బుకింగ్స్ నాలుగు రెట్లు పెరిగాయి. స్థానిక హస్తకళలు, దేవుడి ప్రతిమలు, ఇతర పూజా వస్తవులకు డిమాండ్ పెరగడంతో చేతివృత్తుల వారికి, చిన్న ఉత్పత్తిదారులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోంది.

ఉద్యోగాలు, ఉపాధిపై ప్రభావం

సుమారు 6,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) కొత్తగా ఏర్పాటయ్యాయని లేదా తిరిగి తెరుచుకున్నాయని IIM రిపోర్ట్ చెబుతోంది. రాబోయే 4-5 ఏళ్లలో పర్యాటకం, సంబంధిత రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1.2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. చిన్న దుకాణదారుల రోజువారీ ఆదాయం ₹2,500 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గుడి చుట్టుపక్కల భూముల ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగింది.

ఆధ్యాత్మికతను దాటిన అభివృద్ధి

అయోధ్య అభివృద్ధి ఇప్పుడు కేవలం మతపరమైన ప్రాముఖ్యతకే పరిమితం కాలేదని, ఇది ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళిక, పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పన ఉంటేనే ఇలాంటి మతపరమైన వారసత్వ అభివృద్ధి నమూనాలు విజయవంతమవుతాయని రిపోర్ట్ నొక్కి చెప్పింది. సాంస్కృతిక, మతపరమైన ప్రాజెక్టులను సరైన విధానాలతో అమలు చేస్తే, అవి పర్యాటకం, ఉపాధి, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి బహుళస్థాయి ఆర్థిక మార్పును తీసుకురాగలవని అయోధ్య అనుభవం నిరూపిస్తోంది.

ఏదేమైనా, ఏ మోడల్ అయినా ఎంతకాలం నిలబడుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత గణాంకాలు మాత్రం అయోధ్యలో విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక కొత్త సమతుల్యం ఏర్పడుతోందని, ఈ ప్రాచీన నగరాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టిందని సూచిస్తున్నాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu