ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలను మానుకోండి.. ఐరాస‌లో పాక్ జ‌మ్మూ అంశాన్ని లేవ‌నెత్త‌డంపై భార‌త్ ఆగ్ర‌హం

Published : Mar 08, 2023, 04:31 PM IST
ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలను మానుకోండి.. ఐరాస‌లో పాక్ జ‌మ్మూ అంశాన్ని లేవ‌నెత్త‌డంపై భార‌త్ ఆగ్ర‌హం

సారాంశం

United Nations: మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస విచ్చలవిడిగా కొనసాగుతోందనీ, అన్ని రకాల ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని భారత్ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవ‌నెత్త‌డంపై భార‌త్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. పాకిస్తాన్ చేసిన ద్వేషపూరిత, త‌ప్పుడు ప్రచార వ్యాఖ్యలు ప్రతిస్పందించడానికి కూడా అనర్హమంటూ పేర్కొంది.  

India expresses anger over Pakistan: ఐక్యరాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో మ‌రోసారి పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్దిని ప్ర‌ద‌ర్శించింది. భార‌త్ పై త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. అయితే, జ‌మ్మూకాశ్మీర్ అంశాన్ని లేవ‌నెత్త‌డంపై భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాకిస్తాన్ చేసిన ద్వేషపూరిత, త‌ప్పుడు ప్రచార వ్యాఖ్యలు ప్రతిస్పందించడానికి కూడా అనర్హమంటూ పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. "మహిళలు, శాంతి, భద్రత" అనే అంశంపై ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చలో జామ్మూకాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి లేవనెత్తడంపై భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలను మానుకోండని హిత‌వు ప‌లికింది. జ‌మ్మూకాశ్మీర్ పై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. పాక్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. "నేను నా ప్ర‌సంగం ముగించే ముందు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ప్రతినిధి చేసిన పనికిమాలిన, నిరాధారమైన-రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను" అని ఆమె అన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 'మహిళలు, శాంతి, భద్రత' అనే అంశంపై జరిగిన బహిరంగ చర్చలో కాంబోజ్ మాట్లాడుతూ.. ఇలాంటి దుష్ప్రచారం, అసత్య ప్రచారాలపై స్పందించడం కూడా అనర్హమని తన ప్రతినిధి బృందం భావిస్తోందన్నారు.  త‌మ దృష్టి ఎల్లప్పుడూ ముందుచూపుతో ఉంటుంద‌నీ, సానుకూల దృక్ప‌దంతో "మహిళలు-శాంతి-భద్రత" ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మన సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి నేటి చర్చ చాలా ముఖ్యమైనదని తెలిపారు. తాము ఈ చ‌ర్చ అంశాన్ని గౌరవిస్తామ‌నీ, సమయం ప్రాముఖ్యతను గుర్తిస్తామనీ, అందుకని ప్ర‌స్తుతం త‌మ దృష్టి ఈ అంశంపైనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెలలో మొజాంబిక్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ డిబేట్ లో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. జ‌మ్మూకాశ్మీర్ గురించి ప్రస్తావించిన నేపథ్యంలో భార‌త ప్ర‌తినిధి కాంబోజ్ ఘాటుగా స్పందిస్తూ కౌంట‌రిచ్చారు. కాగా, జ‌మ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారత్ లో భాగమేననీ, ఎప్పటికీ భారత్ లోనే ఉంటాయనీ, ఇదే విష‌యాన్ని గ‌తంలోనూ  పాక్ కు భార‌త్ చెప్పింది. పాకిస్థాన్ తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామనీ, అలాంటి చర్చలకు ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉందని భారత్ పేర్కొంటోంది. 

కాగా, విభ‌జ‌న స‌మ‌యం నుంచి భార‌త్-పాక్ మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఇటీవ‌లి కాలంలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని  బాలాకోట్ లో ఉన్న‌ జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత యుద్ధ విమానాలు దాడి చేసిన తర్వాత భారత్- పాక్ మధ్య సంబంధాలు మ‌రింత‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్ కేంద్రంగా న‌డుస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు జ‌మ్మూకాశ్మీర్ లో ప‌దేప‌దే ఉగ్ర‌వాద దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టం, ఈ ప్రాంతంలో ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేయ‌డానికి భార‌త్ చ‌ర్య‌లు తీసుకుంటునే ఉంది. ఈ క్ర‌మంలోనే 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకుంది. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారత్ ప్రకటించిన తర్వాత పాక్ తో సంబంధాలు మరింత క్షీణించాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu