
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షావర్మా తినవద్దని, అది భారత ఆహారంలో భాగంగా లేదని వివరించారు. ఆదివారం ఆయన ఓ చోట వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని, షావర్మా తినడానికి బదులు వాటిని తినడానికి ఎంచుకోవాలని సూచించారు. ‘షావర్మా పాశ్చాత్యుల ఆహారం. ఈ ఆహారం అక్కడి వారి శీతోష్ణస్థితులకు సరిపోతుందేమో.
ఎందుకంటే..అక్కడ ఉష్ణోగ్రతలు తరుచూ మైనస్ డిగ్రీలకు వెళ్లుతుంది. కాబట్టి, అక్కడ ఈ ఫుడ్ ఐటమ్‌ను బయట ఉంచినా.. అది చెడిపోదు. షావర్మా అనే కాదు.. మరే మాంస ఆహారాన్ని అయినా సరైన శీతోష్ణస్థితుల వద్ద ఫ్రీజర్‌లో ఉంచకపోతే అది నాశనం అవుతుంది. అలా చెడిపోయిన ఆహారాన్ని తీసుకుంటే సీరియస్ ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని వివరించారు.
తమిళనాడు మంత్రి మా సుబ్రమణియన్ షావర్మాను పాశ్చాత్య వంటకంగా పేర్కొన్నారు. నిజానికి ఇది మధ్య ఆసియా దేశాల్లో లభించే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.
తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అంతటితో ఆగలేదు. దేశవ్యాప్తంగా షావర్మా షాపులు వెలిశాయని, కానీ, అందులో చాలా వాటిలో సరైన సౌకర్యాలు లేవని, అదీగాక, షావర్మాను బయట బహిరంగంగా ప్రదర్శనకు ఉంచుతారని, తద్వారా యూత్ అట్రాక్ట్ చేయాలని చూస్తుంటారని వివరించారు. బయట ఉంచడం ద్వారా షావర్మాపై దుమ్ము, ధూళి వచ్చి చేరుతుందని అన్నారు. షావర్మాను మెయింటెయిన్ చేయడానికి సరైన ఫెసిలిటీలు లేకున్నా.. వీటిని అమ్మడానికి దు కాణాలు తెరుస్తున్నారని ఆరోపించారు.
‘అసలు ఈ ఆహారం నిజంగా మన శీతోష్ణస్థితులకు సరిపడుతుందా? లేదా? అనే విషయాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. కనీసం ఈ ఆహారాన్ని(ప్రాసెస్ చేసిన మాంసం) అమ్మడానికి సరైన అనుమతులు తీకున్నామా? లేదా? అనే విషయాన్ని కూడా వారు పట్టించుకోవడం లేదు. వారు కేవలం వ్యాపార కోణంలో మాత్రమే దీన్ని చూస్తున్నారు. రెండు మూడు ఫిర్యాదులు అందిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా షావర్మా షాపులపై నజర్ పెట్టాలని, తనిఖీలు చేపట్టాలని మేం ఆదేశించాం. సుమారు వెయ్యి షాపులు సరైన సౌకర్యాలు మెయింటెయిన్ చేయడం లేని కారణంగా వాటికి జరిమానాలు విధించాం. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో షావర్మా తిని 58 మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఓ చిన్నారి బాలిక మే 1వ తేదీన మరణించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.