Rajasthan: రాజ‌స్థాన్ మంత్రి మ‌హేష్ జోషి కుమారుడిపై అత్యాచారం కేసు న‌మోదు.. !

Published : May 09, 2022, 03:25 PM IST
Rajasthan: రాజ‌స్థాన్ మంత్రి మ‌హేష్ జోషి కుమారుడిపై అత్యాచారం కేసు న‌మోదు.. !

సారాంశం

Rajasthan: రాజస్థాన్ క్యాబినెట్ మినిస్ట‌ర్ మ‌హేష్ జోషి  కుమారుడిపై అత్యాచారం కేసు న‌మోదైంది. 25 ఏండ్ల ఓ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌ న‌మోదుచేశారు.    

Delhi Police: త‌న‌పై ప‌లుమార్లు లైంగిక‌దాడి చేశాడ‌ని ఓ యువ‌తి ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రాజస్థాన్ క్యాబినెట్ మినిస్ట‌ర్ మ‌హేష్ జోషి (minister Mahesh Joshi's son) కుమారుడిపై అత్యాచారం కేసు న‌మోదైంది. పోలీసులు, బాధితురాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌తేడాది జనవరిలో సవాయ్ మాధోపూర్ జిల్లాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో 24 ఏళ్ల యువతికి మద్యం తాగించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ రాజస్థాన్ కేబినెట్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్‌పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను ఫేస్‌బుక్‌లో రోహిత్‌ను కలిశానని, జనవరి 8న సవాయ్ మాధోపూర్‌కు అతనితో పాటు అతని స్నేహితులతో కలిసి వెళ్లాన‌ని బాధితురాలు చెప్పింది. అక్కడ మంత్రి కుమారుడు రోహిత్‌.. తనపై లైంగిక‌దాడి చేసి చిత్రాలు, వీడియోలు తీశాడని పేర్కొంది. వాటిని బయటపెడతానని బెదిరించాడనీ, ఈ క్ర‌మంలోనే ఆ తర్వాత తనను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగిక‌దాడికి  పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

రోహిత్ తండ్రి మంత్రిగా ఉన్నందున.. త‌న‌ను మ‌రింత‌గా ఇబ్బందుల‌కు గురిచేస్తార‌నే భయంతో ఏడాదికి పైగా మౌనంగా ఉన్నానని బాధిత‌మహిళ తెలిపింది. గతేడాది ఆగస్టు 11న తాను గర్భవతి అని తెలుసుకుని రోహిత్‌కు సమాచారం అందించింది. మరుసటి రోజు తనను ఎక్కడికో తీసుకెళ్లి, బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేసి తనపై దాడి చేసి ట్యాబ్లెట్ ఇచ్చాడని ఆమె ఆరోపించింది. వారు చివరిసారిగా ఏప్రిల్‌లో కలుసుకున్నారు, ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గత ఏడాది సెప్టెంబర్‌లో రోహిత్‌తో కలిసి ఢిల్లీకి వచ్చానని బాధితురాలు ఆరోపించింది. దేశ రాజధానిలో రోహిత్ హోటల్ గదిని బుక్ చేసుకున్నాడని, అక్కడ అతను తనపై లైంగిక‌దాడికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. తనపై పలుమార్లు దాడి చేశారని బాధితురాలు పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడని, అయితే తర్వాత పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని, కొన్ని అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను లీక్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇక సెప్టెంబరులో జరిగిన ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే కేసు దర్యాప్తును రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు బదిలీ చేశారు. 

రోహిత్  మంత్రి మహేశ్ జోషి కుమారుడు, అతను ముఖ్యమంత్రి సిఎం అశోక్ గెహ్లాట్‌కు సామీప్యతతో రాజస్థాన్‌లోని శక్తివంతమైన మంత్రులలో ఒక‌రుగా ఉన్నారు. మంత్రివ‌ర్గంలో సీఎం త‌ర్వాత బ‌ల‌మైన నాయ‌కుడిగా మ‌హేష్ జోషికి గుర్తింపు ఉంది. ఇక రోహిత్ కూడా రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో కొన‌సాగుతున్నారు. కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కూడా.  త‌న తంత్రితో క‌లిసి అనేక ప్ర‌జా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటారు. కాగా, ఆయ‌న‌కు ఇదివ‌ర‌కే పెండ్లి కూడా అయింది. ఒక కూతురు కూడా ఉంది. మంత్రి కుమారుడు లైంగికదాడి చేశాడనే కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం