తన ఆటో ఎక్కట్లేదని మహిళకు నిప్పంటించిన డ్రైవర్

By telugu teamFirst Published Aug 13, 2021, 6:52 PM IST
Highlights

తరుచూ తన ఆటోలో ప్రయాణించే ఓ మహిళా ఇప్పుడు తన ఆటోలో ప్రయాణించడం లేదని ఓ డ్రైవర్ ఆమెకు నిప్పంటించాడు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 90శాతం గాయాలపాలైన బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
 

ముంబయి: మహారాష్ట్రంలోని నాసిక్‌లో దారుణం జరిగింది. తరుచూ తన ఆటోలో ప్రయాణించే ఓ మహిళా ఇప్పుడు తన వాహనంలో ప్రయాణించడం లేదన్న ఆగ్రహంతో ఓ డ్రైవర్ ఆమెకు నిప్పంటించాడు. సదరు మహిళకు 90శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

చీరల వ్యాపారం చేసుకుంటున్న భారతి గౌండ్ తరుచూ నిందితుడి ఆటోలో ప్రయాణిస్తుండేది. కానీ, కొన్నాళ్ల నుంచి ఆయన ఆటో ఎక్కడం మానేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై ఆటో డ్రైవర్ వాగ్వాదానికీ దిగాడు. 

మంగళవారం ఆమె తన సోదరి సుశీల దగ్గరకు వెళ్లింది. ఆటో డ్రైవర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. భారతితో మళ్లీ ఆయన వాగ్వాదానికి దిగాడు. ఆమె చెంపపైనా కొట్టాడు. సుశీల ఇంటి నుంచి బయటికి రావాల్సిందిగా ఆదేశించాడు. ఆమె నిరాకరించడంతో కిరోసిన్ లాంటి ద్రవాన్ని ఆమెపై చల్లాడు. అనంతరం అగ్గిపెట్టే తీసి పుల్ల వెలిగించి ఆమెపై విసిరాడు. మంటలు అంటుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

భారతి గౌండ్‌ను మంటల నుంచి రక్షించడానికి సుశీల అప్రమత్తమైంది. వీలైనంత తొందరగా ఆర్పే ప్రయత్నం చేసింది. సోదరి భారతిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. కానీ, అప్పటికే 90శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

పోలీసు అధికారి ఎస్‌బీ చోపడే ఈ ఘటన వివరాలు తెలిపారు. నిందితుడిని వారి బంధువుల ఇంటిలో పట్టుకున్నామని వివరించారు. ఆటో డ్రైవర్‌కు, ఆమెకు గతంలోనే పరిచయం ఉన్నదని తెలిపారు. ఆమె ఎక్కువగా ఆ డ్రైవర్ ఆటోలోనే ప్రయాణించేదని అన్నారు. కానీ, ఇటీవలే ఆమె ఆ ఆటోలో ప్రయాణించడం మానేసినట్టు తెలిసిందని చెప్పారు. బహుశా ఈ కారణంగానే ఆమెను చంపాలని ప్రయత్నించి ఉండవచ్చని వివరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

click me!