
చెన్నైలో ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన 50 సవర్ల నగలను సొంతదారులకు అందించి నిజాయితీ చాటుకున్నాడు. చెన్నై, క్రోంపేట దగ్గర్లో గురువారం ఈ ఘటన జరిగింది.
క్రోంపేట చర్చిలో అదే ప్రాంతానికి చెందిన ఆల్‌బ్రైట్ వ్యాపారుల సంఘం నేత కూతురి వివాహం గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజే సాయంత్రం రిసెప్షన్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆల్‌బ్రైట్ గురువారం ఉదయం చర్చి నుంచి ఆటోలో ఇంటికి వెళ్లాడు.
పెళ్లి హడావుడిలో రూ. 20 లక్షల రూపాయలు విలువ చేసే నగల సంచిని ఆటోలో పెట్టి మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక నగల సంచి కనబడకపోవడంతో ఆల్‌బ్రైట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అయితే కాసేపటికి ఆటోలో నగల సంచిని గమనించిన ఆటో డ్రైవర్ శరవణకుమార్ (30) ఆ సంచీని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అంతకు ముందే ఆల్ బ్రైట్ ఫిర్యాదు ఇవ్వడంతో అవి ఇవే అనే అనుమానంతో నగలు చెక్ చేశారు. అన్నీ సరిగ్గా ఉండడంతో ఆల్‌బ్రైట్ నిర్ధారణ చేసిన తరువాత నగలు అతనికి అప్పజెప్పారు.
అంత పెద్ద మొత్తంలో నగలు దొరికినా సొంతదారునికి అప్పజెప్పి నిజాయితీ చాటుకున్న శరవణ కుమార్ ను పోలీసులు అభినందించారు.