నైట్ క్లబ్‌లలో ఎదుటి వ్యక్తిని అనుమతి లేకుండా తదేకంగా చూడటం నిషేధం... ఎక్కడో తెలుసా?

By Mahesh KFirst Published Aug 27, 2022, 1:00 PM IST
Highlights

ఆస్ట్రేలియాకు చెందిన ఓ నైట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని అనువసరంగా, అనుమతి లేకుండా, ఇబ్బందికరంగా చూస్తే దాన్ని వేధింపులుగా పరిగణిస్తామని తెలిపింది. తమ క్లబ్ వాతావరణం ఆహ్లాదంగా ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పోస్టులో వెల్లడించింది.

న్యూఢిల్లీ: నైట్ క్లబ్‌లలో కొత్త వారిని పరిచయం చేసుకోవడం, సన్నిహితం పెంచుకోవడాన్ని ఎక్కువగా చూస్తాం. కొందరు ఎంజాయ్ చేయడానికి వెళితే.. ఇంకొందరు కొత్త స్నేహాల కోసం ఆ బాట పడతారు. అయితే, కొత్త స్నేహాలను వెతికే క్రమంలో కొన్ని సార్లు ఆటుపోట్లు ఎదురవ్వచ్చు. ఇతరులనూ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని నైట్ క్లబ్‌లలో ఎంజాయ్ చేయడం చాలా కష్టం. ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మరికొన్ని నైట్ క్లబ్‌లు సాధ్యమైనంత మేరకు ఆహ్లాదరకర వాతావరణం కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ రెండో కోవకు చెందినదే ఆస్ట్రేలియాలోని క్లబ్ 77 నైట్ క్లబ్.

క్లబ్ 77లో హరాస్‌మెంట్‌కు అవకాశమే లేదని ఆ క్లబ్ నిర్వాహకులు చెబుతున్నారు. వేధింపులను అరికట్టడానికి జీరో టాలరెన్స అవలంబిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే అనవసరంగా ఇతరుల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలని చేసే ప్రయత్నాాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. తమ క్లబ్ 77ను సేఫ్ స్పేస్‌గా ఉంచాలనే లక్ష్యంతో ఒకరు మరొకరిని అనవసరంగా తదేకంగా చూస్తు వారిని ఇబ్బంది పెడితే తాము సహించబోమని వివరిస్తున్నారు. ఆరోగ్యకరమైన క్లబ్ కల్చర్, కన్సెంట్, హరాస్‌మెంట్లను తాము సీరియస్‌గా తీసుకుంటామని, తమ గెస్టులు నిర్భయంగా ఎంజాయ్ చేయడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో క్లబ్ పేర్కొంది. తమ కస్టమర్లు, ఆర్టిస్టులు, స్టాఫ్‌ల కోసం ఎప్పటి నుంచో ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పిస్తున్నామని వివరించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Club 77 (@club77sydney)

నైట్ క్లబ్‌లో అపరిచుతులను పరిచితం చేసుకోవడాన్ని తాము ఆహ్వానిస్తున్నట్టు ఆ పోస్టు పేర్కొంది. అయితే, అపరిచతులతో పరిచయం పెంచుకోవడానికి ముందు మౌఖిక పరిచయం పెంచుకోవాలని, మౌఖికంగానే మాట్లాడటం మొదలు పెట్టాలని వివరించింది. ఉదాహరణకు కొంత దూరంగా నిలబడి ఒక వ్యక్తిని తమ వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తే.. అదీ అనవసరమైనది అయితే.. మరీ ముఖ్యంగా ఆ  వ్యక్తికి ఇలా దీర్ఘంగా చూడటం ఇబ్బందిగా ఉంటే దాన్ని వేధింపులుగానే పరిగణిస్తామని తెలిపింది.

ఒకరు తమను ఇబ్బంది పెడుతున్నారని ఏ కస్టమర్ ఫిర్యాదు చేసినా.. సదరు వ్యక్తిని ఆ వేదిక దగ్గర నుంచి బయటకు పంపిస్తామని ఆ పోస్టులో క్లబ్ యాజమాన్యం పేర్కొంది. పోలీసులను కూడా రప్పిస్తామని తెలిపింది. ఈ ఘటనలను పర్యవేక్షించడానికి గులాబి రంగు దుస్తుల్లో తమ సిబ్బంది ఎప్పుడూ రెడీగా ఉంటారని వివరించింది.

click me!