
అతడు ఓ హత్య కేసులో నిందితుడు. ఘటన జరిగిన నాటి నుంచి కనిపించడం లేదు. ఈ హత్య కేసులో మరో నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొంత కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. కానీ కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే మరో తప్పించుకొని పారిపోయిన వ్యక్తి మాత్రం పోలీసులకు చాలా ఏళ్ల వరకు చిక్కలేదు. కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టిలో ఈ కేసు ఫైల్ పెండింగ్ లో పడింది. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నో ప్రయత్నాలు తరువాత చివరికి పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు.
31 ఏళ్ల నాటి హత్య కేసులో పరారిలో ఉన్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, మృతురాలి సోదరుడు రామకృష్ణ చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 1991 జూన్ 16 వ తేదీన కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా సిరాలోని హోసహల్లి ప్రాంతంలో జె. గంగమ్మ అనే వితంతువు తన 40వ ఏట హత్యకు గురయ్యింది. ఆమెకు కొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అయితే ఆ భూమిని ఆమె మేనల్లుడు రాజా వారసత్వంగా పొందాలనుకున్నాడు. కానీ గంగమ్మకు అది ఇష్టం లేదు. ఆమె ఓ యువకుడిని దత్తత తీసుకుని భూమిని, ఇతర ఆస్తిని అతడికి బదిలి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజా గంగమ్మను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సహకరించాలని మరో వ్యక్తి శంకరప్ప కోరాడు. అనుకున్న ప్రకారం ఆమెను గొంతు కోసి హత్య చేశారు.
ఈ ఘటనపై మృతురాలి సోదరుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు సైరా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేనల్లుడు రాజా, మరో వ్యక్తి శంకరప్పపై ఐపీసీ 302 (హత్య) కింద పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే రాజా ను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. శంకరప్ప పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయలేకపోయారు. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శంకరప్పను ‘పరారీ’గా ప్రకటించి, చార్జిషీట్‌ను విభజించారు. పోలీసులు అతడి కోసం వెతకడం మానేశారు. దీంతో శంకరప్పపై చార్జిషీట్ విచారణ పెండింగ్‌లో పడింది.
అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2000 సంవత్సరంలో రాజా నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ శంకరప్పపై మాత్రం కేసు అలాగే ఉంది. గతేడాది సెప్టెంబరులో ఆ తుమకూరు జిల్లాకు కొత్త ఎస్పీగా రాహుల్ కుమార్ షహపూర్వాద్ బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న ఈ కేసు ఫైల్‌ను పరిశీలించారు. దీనిని ఛేదించేందుకు మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. సిరా రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సి. రవికుమార్ కు ఈ పని అప్పగించారు. ఈ కేసులను ఛేదించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. శంకరప్ప కుటుంబం మొత్తం ఆ గ్రామాన్ని విడిచివెళ్లిపోయింది. నిందితుడికి మడకశిరకు చెందిన సిద్ధ గంగమ్మ అనే మరో మహిళతో వివాహం అయ్యిందని పోలీసులు గుర్తించారు.
పోలీసులు సిద్దగంగమ్మను వెతుకుతూ వెళ్లారు. ఆమె నిందితుడితో ఉండటం లేదని, తన బంధువులో కలిసి ఉంటుందని వారు తెలుసుకున్నారు. మళ్లీ ఒక సారి పోలీసులు ప్రభుత్వ అధికారుల మాదిరిగా వెళ్లి నిందితుడు ఏపీలో ఎక్కడో ఉంటున్నారని, చాలా అరుదుగా మాత్రమే భార్యను కలుస్తారని కనుగొన్నారు. చాలా ప్రయత్నాల తర్వాత చివరికి కర్నాటక, ఏపీకి సరిహద్దుల్లో ఉన్న హిందూపురం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడని గుర్తించారు. మారువేశంలో వెళ్లి పొలంలోని ఓ తాత్కాలిక షెడ్ లో ఉంటున్న శంకరప్పను మార్చి 10వ తేదీన అరెస్టు చేశారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.