30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్‌.. దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు..

By Rajesh KarampooriFirst Published May 28, 2023, 4:54 AM IST
Highlights

అసోంలోని మజూలి జిల్లాలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించారు. ప్రార్థనా సమయంలో 30 మంది విద్యార్థులను వరుసగా నించోబెట్టి, జుట్టు కత్తిరించారు. దీనిపై పెద్ద దుమారం లేవడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

క్రమశిక్షణ పేరుతో 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఉదంతం అస్సాంలోని  ఓ పాఠశాలలో వెలుగు చూసింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్‌లో గురువారం ఉదయం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రార్థన సమయంలో నిక్కీ అనే టీచర్‌ .. జుట్టు పొడవుగా ఉన్న విద్యార్థులను గుర్తించాడు. వెంటనే ఆ విద్యార్థులకు పాఠశాల గ్రౌండ్ లో నిల్చోబెట్టి ఆ విద్యార్థులందరికీ హెయిర్‌ను కట్‌ చేశాడు.

కాగా ఈ ఘటన తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి నిరాకరిస్తున్నారు. తమ చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చిందని, ఇప్పుడు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులు ఈ ఘటనను చాలా అవమానంగా భావిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణను అమలు చేయడానికి టీచర్లకు హక్కు  ఉందని, అదే సమయంలో దాని పరిమితులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. అసెంబ్లీ సమయంలో మొత్తం పాఠశాల ముందు జుట్టు కత్తిరించడం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే.. తమ చర్యను పాఠశాల యాజమాన్యం సమర్థించుకుంటుంది. మార్గదర్శకాల ప్రకారమే జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులపై  క్రమశిక్షణ కింద చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్కూల్‌ అధికారుల సూచనతోనే తాను విద్యార్థుల హెయిర్‌ కట్‌ చేసినట్లు టీచర్‌ నిక్కీ తెలిపాడు.పలుమార్లు హెచ్చరించినా, తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించినా పట్టించుకోలేదని పాఠశాల అధికారులు తెలిపారు. ఇది క్రమశిక్షణను బోధించే ఒక మార్గం మాత్రమేనని వివరణ ఇచ్చారు. 

మరోవైపు ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ డిప్యూటీ కమిషనర్‌ కావేరి బి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ స్కూల్‌లో కత్తిరించాలన్న మార్గదర్శకాలు ఎక్కడా లేవని అన్నారు. ఆ రోజు పాఠశాలలో ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

click me!