ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ వ్యాప్తి.. పందుల‌ను చంపేస్తున్న అధికారులు !

Published : Jul 17, 2022, 11:04 AM IST
ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ వ్యాప్తి.. పందుల‌ను చంపేస్తున్న అధికారులు !

సారాంశం

Assam: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందుల‌కు సోకే అంటువ్యాధి. ఇది హెమరేజిక్ వైరల్ వ్యాధి. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఎపిక్‌సెంట‌ర్ ప‌రిధిలోని అన్ని పందుల‌ను చంపేస్తున్నామ‌ని తెలిపారు.   

African Swine Fever: అసోంలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ కేసులు గుర్తించిన‌ట్టు అధికారులు తెలిపారు. డిబ్రూగఢ్‌లోని భోగాలి పత్తర్ గ్రామంలోని పందికి వైరస్ పాజిటివ్ అని తేలిన తర్వాత, పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ని నివేదించిన తాజా రాష్ట్రంగా అసోం నిలిచింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందుల‌కు సోకే అంటువ్యాధి. ఇది హెమరేజిక్ వైరల్ వ్యాధి. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఎపిక్‌సెంట‌ర్ ప‌రిధిలోని అన్ని పందుల‌ను చంపేస్తున్నామ‌ని తెలిపారు. దిబ్రూఘర్ పశుసంవర్ధక, పశువైద్య అధికారి డాక్టర్ హిమాందు బికాష్ బారువా మీడియాతో మాట్లాడుతూ ఎపిక్‌సెంట‌ర్ కు ఒక కిలోమీట‌ర్ ప‌రిధిలో ఉన్న అన్ని పందులను చంపినట్లు చెప్పారు.

"మేము మొదట ఒక కిలో మీట‌రు వరకు వ్యాధి సోకిన ప్రాంతాన్ని ప్రకటించాము. నిబంధనల ప్రకారం.. మేము ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకిన ప్రాంతంలో అన్ని పందులను చంపి పాతిపెట్టాము. అదే సమయంలో మేము మొత్తం ప్రాంతాన్ని కూడా శుభ్రపరిచాము" అని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మానవులకు సోకదు లేదా వ్యాపించదు. అయినప్పటికీ ఇది పందులకు ప్రాణాంతకం, అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020 నుండి ఈ ఏడాది జూలై 11 వరకు రాష్ట్రంలో 1,181 పందులను చంపడంతో పాటు 40,159 పందులు జ్వరంతో మరణించాయి.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పట్ల జాగ్రత్త.. 

ఈశాన్య భార‌తంలోని అనేక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను గుర్తించిన‌ట్టు రిపోర్టులు అందుతున్నాయి. అసోం, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, అలాగే ఉత్తరాఖండ్, బీహార్‌లలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించే ర‌కానికి చెందిన‌ది. అలాగే, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ లేదు కాబట్టి, పంది మాంసం తినకూడదని ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు సూచించింది.  ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ యాక్షన్ ప్లాన్‌ను కూడా కేంద్రం సూచించింది, దీనిని అన్ని జిల్లాల పశుసంవర్ధక అధికారులు అనుసరిస్తారు. అన్ని రోగనిర్ధారణ సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. పందుల పెంపకంలో జ్వరాలు లేదా జ్వరాలతో చనిపోతే వాటిపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు నిఘా పెంచి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది. 

బీహార్‌లోనూ.. 

బీహార్‌లోని పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పందులు, పంది మాంసం,  దాని ఉత్పత్తులు, పందుల ఎరువు (పందుల విసర్జనతో సహా) రవాణాపై 30 రోజుల నిషేధం విధించింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నిషేధం జూలై 14 నుంచి 30 రోజుల పాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో పందుల జనాభాను రక్షించడానికి ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

కేర‌ళకు దిగుమ‌తులు నిషేధం 

పందులు, పందుల మాంసం, పందుల మాంసం ఉత్పత్తులు, పందుల పేడను రోడ్డు/రైలు/విమానం/సముద్ర మార్గంలో కేరళకు తరలించడం, దిగుమతి చేసుకోవడంపై ఒక నెల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంతువుల నుండి అంటు వ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం-2009 క్రింద జంతు సంక్షేమ శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది. పందులను ప్రభావితం చేసే ప్రాణాంతకమైన, అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌లో నివేదించబడినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖకు స‌మాచారం ఉంద‌నీ, ఈ క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు