ఖర్గే జీని అడగండి.. ఫలితాల ప్రకటనకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనేది చెప్పేసిన రాహుల్ గాంధీ..!

By Sumanth KanukulaFirst Published Oct 19, 2022, 3:23 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలను అధికారికంగా విడుదల చేయకముందే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని రాహుల్ గాంధీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ చేసిన ఈ కామెంట్స్‌ విపక్షాల చేతికి ఆయుధంగా మారే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలను అధికారికంగా విడుదల చేయకముందే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని రాహుల్ గాంధీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ చేసిన ఈ కామెంట్స్‌ విపక్షాల చేతికి ఆయుధంగా మారే అవకాశం ఉంది. వివరాలు.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న పోలింగ్ జరగగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలో శశి థరూర్‌పై మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఈ మేరకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

అయితే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రకటనకు కొంత సమయం ముందు.. కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రస్తావన వచ్చిన సమయంలో ఖర్గే పేరును రాహుల్ గాంధీ ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా ఆదోనిలో మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాహుల్.. పొత్తులు, పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కాంగ్రెస్ అధ్యక్షడు తీసుకుంటారని చెప్పారు. పార్టీలో తన పాత్ర ఏమిటో కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తారని.. ఆ విషయం ‘‘ఖర్గే జీ, సోనియా జీని అడగండి’’ అని పేర్కొన్నారు. కనీసం రెండు సందర్భాల్లో రాహుల్ గాంధీ.. అధ్యక్షుడిగా ఖర్గే పేరును ప్రస్తావించారు. 

Also Read: ఏపీ రాజధాని, పార్టీతో పొత్తు: వైఎస్ జగన్ కు రాహుల్ గాంధీ షాక్


‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి పాత్రపై నేను వ్యాఖ్యానించలేను.. అది మిస్టర్ ఖర్గే వ్యాఖ్యానించవలసి ఉంది’’ అని రాహుల్ గాంధీ  అన్నారు. అలాగే.. ‘‘నా పాత్రకు సంబంధించినంత వరకు నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నా పాత్ర ఏమిటో, నన్ను ఎలా నియమించాలో పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు.. మీరు ఖర్గే జీ, సోనియా జీని అడగాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 కంటే ముందే రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. ఇదే సమావేశంలో శశి థరూర్, మల్లికార్జున ఖర్గే సీనియర్ నేతలని.. వారు అనుభం ఉన్నారని కూడా రాహుల్ చెప్పారు. 

click me!