సచిన్ పైలట్‌కు అశోక్ గెహ్లాట్ దెబ్బ? సీఎం పోస్టుకు స్పీకర్‌ పేరు సిఫార్సు!

Published : Sep 22, 2022, 04:58 PM IST
సచిన్ పైలట్‌కు అశోక్ గెహ్లాట్ దెబ్బ? సీఎం పోస్టుకు స్పీకర్‌ పేరు సిఫార్సు!

సారాంశం

అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడిగా గెలిచే అవకాశాలూ ఆయనకే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే నిబంధన ప్రకారం, అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సీఎం సీటు కోసం గతంలో తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటారనే చర్చ ఉన్నది. కానీ, సీఎం సీటు కోసం అశోక్ గెహ్లాట్ స్పీకర్ సీపీ జోషి పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది.

జైపూర్: అశోక్ గెహ్లాట్ ఈ పేరు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో, దేశ రాజకీయాల్లో ఎక్కువగా చర్చలోకి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక బరిలో నిలువబోతున్నట్టు వచ్చిన వార్తలు చర్చను లేవదీశాయి. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ పగ్గాలు చేపడితే.. రాజస్తాన్ సీఎంగా సచిన్ పైలట్ బాధ్యతలు తీసుకుంటారు అనే చర్చ ఊపందుకుంది.

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సచిన్ పైలట్ తిరుగుబాటు చేసింది. రాజస్తాన్ సీఎంగా తనను ఎంచుకోలేదని సచిన్ పైలట్ ఆక్రోశించినట్టు అప్పుడు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ నాయకత్వం బుజ్జగించడంతో తిరుగుబాటు విరమించుకున్నాడు. తాజాగా పార్టీ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పేరు వినిపించడంతో రాజస్తాస్ సీఎం సీటుపై మళ్లీ హట్‌గా చర్చ మొదలైంది.

కాంగ్రెస్ పార్టీలో ఒక్క వ్యక్తికి ఒకే పదవి లేదా పోస్టు అనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. రాహుల్ గాంధీ కూడా ఈ రోజు ఈ విషయమై స్పష్టం చేశారు. ఒకరికి ఒకే పోస్టు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ సీటును సచిన్ పైలట్ అధిరోహిస్తాడని చర్చ జరుగుతున్నది.

సచిన్ పైలట్ కూడా సీఎం సీటుపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ, అశోక్ గెహ్లాట్ మరో సారి సచిన్ పైలట్ ఆశలపై నీళ్లు జల్లే అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి స్వీకరిస్తే.. రాజస్తాన్ సీఎంగా స్పీకర్ సీపీ జోషిని ఎంపిక చేయాలని ఆయన సిఫార్సు చేసినట్టు వివరించాయి. సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్ సీపీ జోషిని సిఫార్సు చేసినట్టు పేర్కొన్నాయి. దీంతో సచిన్ పైలట్‌కు పరోక్షంగా అశోక్ గెహ్లాట్ మరో సారి దెబ్బేసినట్టేనని చెబుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?