ఈ విషయం నేను మోదీని అడగాలని అనుకుంటున్నాను.. : యూసీసీపై గుజరాత్ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ఒవైసీ

By Sumanth KanukulaFirst Published Oct 30, 2022, 9:48 AM IST
Highlights

యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు కోసం అన్ని అంశాలను మూల్యాంకనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా గుజరాత్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు కోసం అన్ని అంశాలను మూల్యాంకనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా గుజరాత్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు, హిందూత్వ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని ఆరోపించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని వడ్గామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ... యూసీసీని అమలు చేయడం కేంద్రానిదే తప్ప రాష్ట్రాలకు కాదని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు. 

‘‘యూనిఫాం సివిల్ కోడ్ స్వచ్ఛందంగా ఉండాలని.. తప్పనిసరి కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది నిజం కాదా?.. కానీ బీజేపీ మాత్రం తన హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగాలని కోరుకుంటోంది. ఓట్ల కోసం ఎన్నికల ముందు ఇలాంటి అంశాలను లేవనెత్తడం బీజేపీకి అలవాటే" అని ఒవైసీ ఆరోపించారు.

యూసీసీ అవసరం లేదని 2018లో లా కమిషన్ చెప్పిందని ఒవైసీ అన్నారు. యూసీసీని అమలు చేయడం ద్వారా ఆర్టికల్ 29 (మైనారిటీ సమూహాల ప్రయోజనాలను పరిరక్షించేది)కి వ్యతిరేకంగా ఎవరైనా చట్టాన్ని రూపొందించవచ్చా? అని ప్రశ్నించారు. ‘‘హిందూ అవిభక్త కుటుంబం కింద ఆదాయపు పన్ను రాయితీ ప్రయోజనం నుంచి ముస్లింలు, క్రైస్తవులను ఎందుకు మినహాయింపు ఇవ్వరని నేను ప్రధానమంత్రిని అడగాలనుకుంటున్నాను? ఇది సమానత్వ హక్కుకు విరుద్ధం కాదా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు. 

ఇక, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గుజరాత్ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇందుకు గుజరాత్ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ‘‘కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తారు. ముగ్గురు నుండి నలుగురు సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు కమిటీ సభ్యులను ఎంపిక చేయడానికి మంత్రివర్గం అధికారాలు ఇచ్చింది’’ కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Also Read: ఎన్నికల వేళ గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం .. యునిఫాం సివిల్‌ కోడ్‌ అమలుకు ముందడుగు

ప్రతిపాదిత యూసీసీ రాజ్యాంగం కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించదని రూపాలా తేల్చిచెప్పారు.హిందూ వివాహ చట్టం, ముస్లిం వ్యక్తిగత చట్టాలు రాజ్యాంగంలో భాగం కానందున.. యూసీసీ  పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.  యూసీసీ హామీ ఇచ్చి హిందూ ఓట్లను పోలరైజ్ చేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

ఈ కమిటీ యూసీసీకి సంబంధించిన వివిధ అంశాలను మూల్యాంకనం చేసి తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దీని అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుందని రూపాలా తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ ఉమ్మడి చట్టాన్ని వర్తింపజేయాలని భావిస్తున్న రాజ్యాంగంలోని పార్ట్ 4లోని ఆర్టికల్ 44 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. ‘‘ఇది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. సాధారణ ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తల కోరికను మా ప్రభుత్వం గౌరవించింది’’ అని అన్నారు. 

click me!