
Asad Ahmed Encounter: ఉత్తరప్రదేశ్ లో ఒక్కసారిగా ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాఫియా డాన్ అతిక్ కుమారుడు అసద్ ను, అతని సహచరుడు గులామ్‌ను యూపీ ఎస్టీఎఫ్ బృందం హతమార్చింది. ఈ ఎన్‌కౌంటర్ పై UP STF ADG అమితాబ్ యష్ మాట్లాడుతూ.. హంతకుడు అసద్ అహ్మద్ ను ట్రాక్ చేయడంలో STF బృందం విజయం సాధించిందని ప్రశంసించారు. వారి వద్ద ఆధునాతన ఆయుధాలు ఉన్నాయని తెలుసుకున్నSTF బృందం అప్రమత్తమైందనీ, హంతకుడు, అతని అనుచరుడిని ఎలాగైనా పట్టుకోవాలని STF బృందం సిద్ధమైందని తెలిపారు.
దాదాపు రెండు నెలలుగా అసద్ ను ట్రాక్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరుణంలో అతడు దాదాపు 6 నగరాల్లో తల దాచుకున్నాడనీ, నిఘా వర్గాల సమాచారం మేరకు ఝాన్సీలో అతడిని గుర్తించామన్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్, అతని అనుచరుడు గులాంను హతమరిచినట్టు పేర్కొన్నారు. దీంతో పాటు వారిద్దరి నుంచి విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఆయుధాలు చాలా అరుదుగా లభిస్తాయని STF ADG తెలిపారు.
ఉమేష్ హత్య తర్వాత హంతకుడు అసద్, అతని అనుచరుడు గులాం పరారీలో ఉన్నారనీ, తొలుత వారు లక్నో నుంచి బైక్‌పై కాన్పూర్ చేరుకున్నారనీ, ఆ తరువాత కాన్పూర్ నుండి బస్సులో నోయిడా చేరుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో వారిద్దరూ డిఎన్‌డి లో ఉన్నారనీ, అనంతరం అక్కడ నుంచి ఢిల్లీలోని సంగమ్ విహార్ చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ 15 రోజుల పాటు ఉన్నారని , కొన్ని రోజులు క్రితం అజ్మీర్ కు చేరుకున్నారని తెలిపారు. అక్కడ కూడా పరిస్థితుల సరిగా లేకపోవడంతో అజ్మీర్ నుండి ఝాన్సీకి చేరుకున్నారు. నేడు ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ చనిపోయారని STF ADG అమితాబ్ యష్ తెలిపారు.
శాంతిభద్రతలపై సీఎం సమావేశం
మరోవైపు.. అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సహచరుడి ఎన్‌కౌంటర్ తరువాత సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలపై సమావేశం నిర్వహించారు. యూపీ ఎస్టీఎఫ్‌తో పాటు డీజీపీ, స్పెషల్ డీజీ లా అండ్ ఆర్డర్ బృందాన్ని సీఎం యోగి ప్రశంసించారు. అదే సమయంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ ఎన్‌కౌంటర్ గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారంపై నివేదికను సీఎం ముందు ఉంచారు.