
Punjab election result 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ.. రాష్ట్రంలోని అన్నిప్రధాన పార్టీలను ఊడ్చిపడేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మరో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది అని తెలిపారు. త్వరలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఆప్ భర్తీ చేస్తుందని అన్నారు. దేశంలో అతిపెద్ద ప్రతిపక్షంగా ఆప్ అవతరిస్తుందని తెలిపారు.
"ఆప్ జాతీయ శక్తిగా మారడాన్ని నేను చూస్తున్నాను. కాంగ్రెస్‌కు జాతీయ మరియు సహజ ప్రత్యామ్నాయంగా ఆప్ అవతరించబోతోంది" అని రాఘవ్ చద్దా మీడియాతో అన్నారు. "ఇది ఒక పార్టీగా ఆప్‌కి అద్భుతమైన రోజు, ఎందుకంటే ఈ రోజు మేము జాతీయ పార్టీగా మారాము. మేము ఇకపై ప్రాంతీయ పార్టీలం కాదు. సర్వశక్తిమంతుడు.. అరవింద్ కేజ్రీవాల్ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అతను ఒక రోజు దేశానికి నాయకత్వం వహించాలి" అని ఆయన అన్నారు. అలాగే, 2012లో స్థాపించిన ఆప్ కంటే రెండు రాష్ట్రాలను గెలవడానికి బీజేపీకి చాలా ఎక్కువ సమయం పట్టిందని రాఘవ్ చద్దా అన్నారు. ఓట్ల లెక్కింపు మూడు గంటల సమయంలోనే ఆప్ తిరుగులేని అధిక్యం సాధిస్తూ.. ముందుకు సాగింది. అధికార పార్టీ కాంగ్రెస్ దారుణంగా వెనుకబడి ఉంది.
"పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్ పాలనా నమూనాను చూశారు మరియు వారు దానిని ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. ఐదు దశాబ్దాలుగా, పంజాబ్ ప్రజలను తమకు రావాల్సిన సౌకర్యాలు లేకుండా ఉంచిన వారు మరియు శాశ్వతంగా పాలిస్తారని భావించిన వారు ఇప్పుడు విసిరివేయబడ్డారు. ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు" అని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సూచించే విధంగా సాగే AAP ఎన్నికల ప్రచార గీతం " ఇక్ మౌకా కేజ్రీవాల్ ను (కేజ్రీవాల్‌కి అవకాశం ఇవ్వండి)ష పాడారు రాఘవ్ చద్దా. పంజాబ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, రాష్ట్ర కీర్తిని పునరుద్ధరించడానికి AAP బ్లూప్రింట్‌పై పని చేస్తుందని చద్దా చెప్పారు "ఈ విజయం అర్థం ఏమిటో మాకు తెలుసు. దీని విలువ మాకు అర్థమైంది అని ఆయన అన్నారు.
తాజా వివరాల ప్రకారం.. మొత్తం 117 సీట్లలో AAP 89, కాంగ్రెస్‌కు 15 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. అలాగే, అకాలీలు 7, బీజేపీ, మిత్రపక్షాలు 3 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో ముందజల్లో ఉన్నాయి. ఇదిలావుండగా, పంజాబ్ లో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.