Goa Assembly Election 2022: మనోహర్ పారికర్ కొడుక్కు కేజ్రీవాల్ ఆఫర్.. స్పందించని బీజేపీ

By Mahesh KFirst Published Jan 20, 2022, 4:06 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు పంజిమ్ నుంచి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మనోహర్ పారికర్ పంజిమ్‌కే గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉత్పల్ పారికర్‌కు టికెట్ ఆఫర్ చేశారు. ఆప్‌లోకి చేరి తమ టికెట్‌పై పోటీ చేయాలని ఉత్పల్ పారికర్‌కు కేజ్రీవాల్ ఆఫర్ చేశారు. ఒక వేళ ఉత్పల్ పారికర్ స్వతంత్రంగా బరిలోకి దిగితే.. బీజేపీయేతర పార్టీలు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించాలని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నిక(Goa Assembly Elections)ల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ సీనియర్ నేత.. అతి సాధారణ నేతగా పేరున్న గోవా మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్(Manohar Parrikar) కొడుక్కు బీజేపీ(BJP) టికెట్ ఇవ్వలేదు. మనోహర్ పారికర్ పంజిమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. అదే సీటు నుంచి టికెట్ కావాలని ఆయన కొడుకు ఉత్పల్ పారికర్(Utpal Parrikar) ఆశించాడు. కానీ, బీజేపీ అందుకు అంగీకరించలేదు. ఈ పరిణామాన్ని ఆప్(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఉత్పల్ పారికర్‌కు టికెట్ ఆఫర్ చేశారు. ఉత్పల్ పారికర్‌ను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తద్వార తమ పార్టీ టికెట్‌పై పంజిమ్ నుంచి పోటీ చేయవచ్చని సూచించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అయితే, ఉత్పల్ పారికర్ తమ పార్టీలో ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. పంజిమ్ నుంచి టికెట్ ఇవ్వకున్నా.. వేరే స్థానం నుంచి టికెట్ ఇచ్చే అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాగా, తన వైఖరిని త్వరలోనే ప్రకటించనున్నట్టు ఉత్పల్ పారికర్ తెలిపారు.

గోవా నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ పేరు లేదు. పంజిమ్ నుంచి ఉత్పల్ పారికర్ పోటీ చేయాలని ఆశించాడు. కానీ, బీజేపీ అందుకు అంగీకరించలేదు. ఉత్పల్ పారికర్‌కు బీజేపీయేతర పార్టీల నుంచి మంచి మద్దతు ఉన్నది. పంజిమ్ నియోజకవర్గం నుంచి ఉత్పల్ పారికర్ స్వతంత్రంగా పోటీకి దిగితే.. బీజేపీయేతర పార్టీలన్నీ ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించాలని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆప్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలన్నీ ఆయనకు మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థిని ఓడించాలని పిలుపు ఇచ్చారు.

కాగా, ఉత్పల్ పారికర్ ఆశించిన తన తండ్రి పోటీ చేసిన స్థానం పంజిమ్ నుంచి వివాదస్పద నేతగా పేరుపడ్డ బాబుష్ మాసరెట్‌ను బీజేపీ బరిలోకి దింపుతున్నది. ఓ టీనేజర్‌పై 2016లో లైంగికదాడి చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. మనోహర్ పారికర్ కొడుకును వదిలిపెట్టి.. ఓ వివాదాస్పద నేతను బరిలోకి దించాల్సిన అవసరం ఏం ఉందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

గోవాలో దాదాపు అన్ని స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఎవరైనా సరే.. గెలిచేవారినే అభ్యర్థిగా ఎంచుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. బాబుష్ మాసరెట్ ఇది వరకు పంజిమ్ నుంచి గెలిచిన చరిత్ర ఉన్నది. ఆయనకు ఈ చుట్టుపక్కల్లో మంచి పలుకుబడి ఉన్నది. అదీగాక, కేవలం ఒక వెటర్ లీడర్ కొడుకు అయినంత మాత్రానా టికెట్ ఇవ్వాలనీ ఏమీ లేదని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఒక ఎన్నికలో భార్య, భర్తలకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీ సాధారణ నియమం. కానీ, ఈ నిబంధనను కూడా గోవా ఎన్నికల్లో ఖాతరు చేయడం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే.. అభ్యర్థుల జాబితా చూస్తే.. భార్య భర్తలకు టికెట్ ఇచ్చిన కేసులూ రెండు ఉన్నాయి.

గోవా అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!