ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..?

By Rajesh KarampooriFirst Published Jun 10, 2023, 6:16 AM IST
Highlights

Arvind Kejriwal Review Petition:ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జూన్ 30న విచారణ జరగనుంది.
 

Arvind Kejriwal Review Petition: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికేట్ వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 31న వెలువరించిన ఉత్తర్వుపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. డిగ్రీ పంచుకోవాలంటూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్‌కు 25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. 

ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్‌ దాఖాలు చేశారు. దీనిని  గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరెన్ వైష్ణవ్ స్వీకరించారు. శుక్రవారం స్వల్ప విచారణ అనంతరం తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేశారు. అనంతరం గుజరాత్ యూనివర్శిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ లేవనెత్తిన కీలక వాదన ఏమిటంటే.. ప్రధాని మోదీ డిగ్రీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని గుజరాత్ విశ్వవిద్యాలయం చెప్పిందని, అయితే విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అలాంటి డిగ్రీ అందుబాటులో లేదని అన్నారు.

అసలు విషయం ఏమిటి?

వార్తా సంస్థ పిటిఐ కథనం ప్రకారం.. వాస్తవానికి ఏప్రిల్ 2016లో కేంద్ర సమాచార కమిషన్ గుజరాత్ యూనివర్సిటీకి ఆర్టీఐ కింద పీఎం మోదీ ఎంఏ డిగ్రీ కాపీని ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పటి సిఐసి ఆచార్యులు మోడీ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం, గుజరాత్ విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. కేజ్రీవాల్ ఆచార్యులుకు లేఖ రాసిన ఒక రోజు తర్వాత CIC ఉత్తర్వు వచ్చింది.  అందులో తన గురించి పబ్లిక్ రికార్డులను బహిరంగపరచడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఆప్ జాతీయ కన్వీనర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ గురించిన సమాచారం అందించాలని గుజరాత్ యూనివర్సిటీకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఇటీవల హైకోర్టు రద్దు చేయడం గమనించదగ్గ విషయం.

click me!