అరెస్ట్ చేయొద్దని ఈడీని ఆదేశించండి - ఢిల్లీ హైకోర్టును కోరిన అరవింద్ కేజ్రీవాల్

By Sairam IndurFirst Published Mar 21, 2024, 10:49 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరు అవుతానని, కానీ ఆ దర్యాప్తు సంస్థ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ జరపనుంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు సంస్థ తనకు జారీ చేసిన సమన్లకు సంబంధించి తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును కోరారు. సమన్లకు కట్టుబడి ఉంటే తనను అరెస్టు చేయబోమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హామీ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.

కేజ్రీవాల్ తాజా పిటిషన్ ను జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ తో కూడిన ధర్మాసనం నేడు విచారించనుంది. ఎక్సైజ్ పాలసీ కేసులో తనను అరెస్టు చేయబోమని, లేదా తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశిస్తే.. తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాగా.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు జారీ చేసిన తొమ్మిది సమన్లను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. రద్దయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరైతే అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే విచారణ సందర్భంగా సమన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినప్పటికీ రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది.

సమన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అదే కేసులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.అయితే బుధవారం జరిగిన విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు ఎందుకు హాజరుకాలేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. 

దీనిపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింధ్వీ స్పందిస్తూ.. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోరారు. ఈడీ సమన్లన్నింటికీ తాము సమాధానాలు ఇచ్చామని సింఘ్వీ పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా ఈడీ ముందు హాజరై సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

click me!