అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. దేశ వ్యాప్త ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు..

By Sairam Indur  |  First Published Mar 22, 2024, 8:05 AM IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నేడు దేశ వ్యాప్త నిరసనలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. దేశంలోని ఉన్న అన్ని బీజేపీ కార్యాలయాల ఎదుట ఆందోళన జరపాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆప్ ఢిల్లీ శాఖ కన్వీనర్, మంత్రి గోపాల్ రాయ్ గురువారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య హత్య అని, నియంతృత్వ ప్రకటన అని రాయ్ అన్నారు.

‘‘ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆప్ కార్యాలయం వద్ద సమావేశమై, ఆ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతాం’’ అని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos

‘‘కేజ్రీవాల్ ను అరెస్టు చేయగలిగితే ఎవరినైనా అరెస్టు చేసి వారి గొంతు నొక్కవచ్చు. ఇవాళ్టి నుంచి పోరు మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని, ఒక సిద్ధాంతం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు రావు. అయితే కేవలం 40 స్థానాలకే పరిమితమవుతుందని భావిస్తోంది. దీంతో ప్రతిపక్ష నేతలను కాషాయ పార్టీ టార్గెట్ చేస్తోంది’’ అని రాయ్ పేర్కొన్నారు

ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ కూడా కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తీరును ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ, ఆప్ ల మధ్య పోరు కాదని, దేశ ప్రజలకు, బీజేపీకి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఇది ఆప్ పోరాటం కాదని, దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కోరుకునే వారందరి పోరాటం అన్నారు. కేజ్రీవాల్ పోరాటం రోడ్ల నుంచి కోర్టు వరకు కొనసాగుతుందని అతిషి తెలిపారు. 

కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ను అరెస్టు చేసి సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. అయితే ఈడీ బలవంతపు చర్యల నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే సీఎం అరెస్ట్ అయ్యారు.

click me!