చైనా బెదిరింపులకు భయపడం.. ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు: అరుణాచల్ సరిహద్దు గ్రామ ప్రజలు

By Mahesh KFirst Published Aug 28, 2022, 2:53 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపు చిట్ట చివరి గ్రామం.. చైనా సరిహద్దుకు అతి సమీపంగా ఉన్న కొహో గ్రామ ప్రజలు ఇప్పుడు తాము చైనాకు భయపడటం లేదని అన్నారు. వారంతా భారత ఆర్మీకి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇండియన్ ఆర్మీ ఈ గ్రామ ప్రజలకు పలురకాల ఆవశ్యక సేవలను అందిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ కవ్విస్తూ ఉంటుంది. కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటుంది. ఒక్కోసారి దుస్సాహసానికి ఒడిగడుతుంది. ఇలా ఏ దుశ్చర్యకు పాల్పడ్డా ఈ రెండు దేశాలను విభజించే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)కు సమీపంగా ఉండే గ్రామాలే దాని విపరిణామాలను తొలిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామాలు ఈ దుష్పరిణామాలకు బాధితులుగా మిగలడం తరుచూ చూస్తుంటాం. ఇలాంటి ఓ గ్రామమే కొహో. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో కొహో గ్రామం
ఉన్నది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వైపు ఉన్న చిట్ట చివరి గ్రామం. చైనా సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉండటం మూలంగా ఈ గ్రామ ప్రజల్లో భయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.

ఈ కొహో గ్రామాన్ని ఇండియన్ ఆర్మీ ఒక మోడల్ విలేజ్‌గా తయారు చేస్తున్నది. ఈ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. పలు సేవలను కూడా ఇండియన్ ఆర్మీ ఆ గ్రామ ప్రజలు అందిస్తున్నది. దీంతో ఆ గ్రామ ప్రజలకు ఆర్మీకి మధ్య మంచి అటాచ్‌మెంట్ ఏర్పడింది.

ఎగుడు, దిగుడు, కొండ కోనల నడుమ ఉన్న ఈ గ్రామ ప్రజలకు అవసరమైన ఉచిత రేషన్, మెడికల్ సహాయాన్ని ఇండియన్ ఆర్మీ అందిస్తున్నది. అలాగే, టూరిస్టులకు అట్రాక్ట్ చేయడానికి హోమ్ స్టేలనూ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. టూరిస్టులు వస్తే గ్రామం ఆర్థికంగా పరిపుష్టం చెంది స్థానికులకు ఆర్థిక అవకాశాలను అందిస్తుందని ఆశిస్తున్నారు.

చైనా వైపు నుంచి వస్తే.. అరుణాచల్ ప్రదేశ్‌లో తొలిగా ఎదురయ్యే ఈ కొహో గ్రామంలో 79 మంది నివసిస్తున్నారు. మొత్తం 16 ఇళ్లు నిర్మించారు. కానీ, చైనా సరిహద్దుకు సమీపంగా ఉండటం చేత గ్రామ ప్రజల్లో ఎప్పుడూ ఏదో ఆందోళన చెలరేగుతూ ఉండేది.

స్థానిక నివాసి మాధురి మేయర్ మాట్లాడుతూ, ఈ రీజియన్‌లోని నివాసులు భారత జవాన్లతో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారని, అంతేకాదు, తాము చైనాకు భయపడటం లేదని స్పష్టం చేశారు. ఆర్మీ జవాన్లు కూడా తమ గ్రామాల్లో నివసిస్తుంటారని, వారితో గ్రామ ప్రజలకు సత్సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు. అయితే, ఇక్కడ నెట్ వర్క్ సమస్య వెంటాడుతున్నదని, జవాన్లను సంప్రదించాలన్న ఈ సమస్య ఆటంకంగా మారిందని వివరించారు. అయితే, తాము చైనాకు భయపడటం లేదని అన్నారు. ఫ్రీ రేషన్ అందిస్తున్నందున ఆర్మీకి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉన్నట్టు స్థానికులు వివరించారు.

click me!