Bengaluru: దేవుడికి సమర్పించడానికి ఇద్దరు వ్యక్తులు మాంసం ముద్దలతో కూడిన దండలను తీసుకెళ్లారు. అయితే, దేవుడికి వేసే సమయంలో వాటిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి.. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతీంద్రియ శక్తుల కోసమే ఇలా చేసినట్టు తెలిసింది.
Lord Shaneshwara at Sri Shani Mahatma temple: అతీంద్రియ శక్తుల కోసమని తనను తానుగా దేవుడిగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి చెప్పాడని దేవుడికి మాంసంతో కూడిన మాలను వేయడానికి వెళ్లారు. అది పూలమాలగా కనిపించడానికి మాంసం ముద్దల చుట్టూ గులాబీ పూలను పెట్టారు. అయితే, దేవుడికి సమర్పించడానికి ముందే గుర్తించడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడికి వేసే సమయంలో వాటిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి.. మాలను వేయడానికి వచ్చిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపూర్ తాలూకా చిక్కమధూరులోని శ్రీ శని మహాత్ముని ఆలయంలో శనీశ్వరుడికి గులాబీలతో కూడిన మాంసం దండ సమర్పించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోటే తాలూకా కంబాలహళ్లికి చెందిన మునిరాజు(24), బెంగళూరులోని వైట్ ఫీల్డ్ కు చెందిన ఆటోరిక్షా డ్రైవర్ సోమశేఖర్ (45) సాయంత్రం 4 గంటల సమయంలో ఆలయానికి చేరుకోగా పార్కింగ్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వీరిద్దరూ జనవరిలో ఇలాంటి ప్రయత్నం చేయగా అప్పటినుంచి గార్డులు వారి కోసం గాలిస్తున్నారు. మాల గురించి అడిగితే దేవుడికి సమర్పించడానికి వచ్చామని చెప్పారు. అయితే, గులాబీల కింద, దండలో మాంసం ఉందని గార్డులు గుర్తించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ కేవీ మాట్లాడుతూ.. నష్టపోయిన ఓ వ్యాపారి తరఫున తాము వచ్చామనీ, శనీశ్వరుడికి మాలలు సమర్పించాలని భావించామని చెప్పారు. మాల వేయడానికి వచ్చిన వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. హోస్కోటే తాలూకాలోని ఓ దేవాలయంలో శనీశ్వరుడి ప్రభావాన్ని తగ్గించడానికి మాంసం దండను సమర్పించాలని మునిరాజుకు ఓ స్వయం ప్రకటిత దైవం సలహా ఇచ్చినట్లు తెలిసిందన్నారు. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో మునిరాజు, సోమశేఖర్ లు ఇదే తరహా పూలదండతో ఆలయానికి వెళ్లారు. పూజారి భోజనానికి బయటకు వెళ్లడంతో ఇద్దరూ దండను అక్కడే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు.