
Army jawan goes missing from Kashmir: కాశ్మీర్ లో భారత ఆర్మీ జవాను ఒకరు కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే అతని కారులో రక్తపు మరకలు కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ కు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు అదృశ్యమైన జవాను జాడను గుర్తించడానికి ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించాయి.
వివరాల్లోకెళ్తే.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సెలవులో ఉన్న ఓ సైనికుడు కనిపించకుండా పోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ సైనికుడు ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కుల్గాం జిల్లా అచతాల్ ప్రాంతానికి చెందిన జావేద్ అహ్మద్ వనీ శనివారం సాయంత్రం కనిపించకుండా పోయాడు.సెలవుపై ఇంటికి వచ్చిన 25 ఏళ్ల సైనికుడిని వాహనం నుంచి కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుల్గాం జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన జావేద్ అహ్మద్ వనీ.. భారత ఆర్మీలో లేహ్ (లడఖ్)లో విధులు నిర్వహిస్తూ శనివారం రాత్రి 8 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు.
పరాన్హాల్ వద్ద జవాను కారును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అపహరణకు గురైన జవాను ఆచూకీ కోసం భారత సైన్యం, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. కిరాణా సరుకులు కొనేందుకు జావేద్ తన కారు తీసుకుని చౌల్గాంకు వెళ్తున్నట్టు సమాచారం. వనీ కనిపించకుండా పోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాను ప్రాణాలతో వదిలేయాలని కన్నీరు పెట్టుకుంటున్నారు. అతను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని కోరుతున్నామనీ, వారు కోరుకుంటే అతని ఉద్యోగాన్ని కూడా వదులుకుంటాడని మీడియాతో అన్నారు.
కాగా, కారులో రక్తపు మరకలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ అధికారులు ధృవీకరించలేదు. సైనికుడిని రక్షించేందుకు పోలీసులు కుల్గాం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.