భారత సైన్యం సంచలన నిర్ణయం: ఫేస్‌బుక్ సహా 89 యాప్‌లపై నిషేధం

By Siva KodatiFirst Published Jul 9, 2020, 7:08 PM IST
Highlights

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది. జూలై 15లోపు 89 యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది.

సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపథ్యంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది.

టిక్‌టాక్, హెలో, షేర్‌ఇట్ సహా ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆన్‌లైన్‌లో సైనికులను లక్ష్యంగా ఎంచుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ సైనికాధికారి ఒకరు తెలిపారు.

కాగా గతేడాది నవంబర్‌లోనూ అధికారిక పనుల కోసం వాట్సాప్‌ను ఉపయోగించకూడదని సైన్యం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ఖాతాల్లోని సున్నితమైన సమాచారాన్ని తొలగించాలని సూచించింది.

మహిళల పేరుతో  పాకిస్తాన్ ఏజెంట్లు భారత సైనికులను వలపు ఉచ్చులోకి దించి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో ఫేస్‌బుక్ వాడొద్దని, కార్యాలయాల్లోకి, నావల్ డాక్‌ల్లోకి మొబైళ్లు తీసుకురావొద్దని ఇండియన్ నేవి గతంలోనే తమ సిబ్బందిని ఆదేశించిన సంగతి తెలిసిందే. 

click me!