కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకలు హింసాత్మకం.. వ్యక్తిపై కత్తితో దాడి.. పోలీసులపైనా దాడి

By Mahesh KFirst Published Dec 19, 2022, 4:27 PM IST
Highlights

కేరళలో అర్జెంటినా ఫుట్ బాల్ జట్టు విజయాన్ని కేరళలో ఫ్యాన్స్ సంబురాలు జరుపుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులపై దాడి చేశారు. ఓ వ్యక్తిపైనా కత్తితో దాడి జరిగింది.
 

తిరువనంతపురం: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. అర్జెంటినా విజయ వేడుకను అందరూ జరుపుకున్నారు. మన దేశంలో కేరళ ఫుట్‌బాల్‌‌‌ ఫ్యాన్స్‌కు హాట్‌స్పాట్‌ వంటిది. ఇక్కడ ఫుట్ బాల్ అంటే ప్రాణమిస్తారు. మ్యాచ్‌కు ముందే అర్జెంటినా టీమ్ సారథి లియోనల్ మెస్సీ ఫొటోను సముద్రంలోపల ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా స్క్రీన్‌లు ఏర్పాటు చేసి చూశారు. అర్జెంటినా విజయం మెస్సీ ఫ్యాన్స్‌కు అంతులేని సంతోషాన్ని తెచ్చింది. ఈ సంబురాలు పలుచోట్ల హద్దుమీరాయి. కేరళలో ఈ సంబురాలు జరుపుకునే చోటే ఓ వ్యక్తిని కత్తితో పొడిచారు. మరో చోట రోడ్డును దిగ్బంధించి సెలబ్రేట్ చేసుకుంటున్న యువతను వారించబోయిన పోలీసుపై దాడి చేశారు.

కొచ్చిలోని కలూరు‌లో ఓ సివిల్ పోలీసు ఆఫీసర్‌ను ఫుట్ బ్యాల్ ఫ్యాన్స్ కొట్టారు. ట్రాఫిక్‌ను బ్లాక్ చేయవద్దని పోలీసు వారిని కోరాడు. అర్జెంటినా విజయాన్ని ఆ యువత రోడ్డుపైనే జరుపుకుంటున్నది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై యువతను నిలదీయబోయిన పోలీసు అధికారిపై దాడి చేశారు. రోడ్డుపైనే ఈడ్చుకెళ్లి దాడి చేశారు.

కాగా, కన్నూరులో ఐదుగురు వ్యక్తులు కలిసి 24 ఏళ్ల అనురాగ్ అనే యువకుడిని కత్తితో పొడిచారు. అర్జెంటినా, ఫ్రాన్స్‌‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసి వెనుదిరుగుతున్న సమయంలో అతడిపై దాడి జరిగింది. పల్లియమూల నేతాజీ ఆర్ట్స్, స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యాచ్ స్క్రీనింగ్ వేశారు. ఇక్కడ చూసి వెనుదిరుగుతుండగా దాడి జరిగింది.

Also Read: ఫిఫా ప్రపంచకప్ ... ఆర్జెంటినా, ఫ్రాన్స్ ల ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

అనురాగ్ తీవ్రంగా దాడికి గురయ్యాడు. ప్రస్తుతం కన్నూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన అతని ఫ్రెండ్స్ పైనా క్రికెట్ స్టంప్స్‌తో దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంబంధిత ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు ఫైల్ చేశారు.

తిరువనంతపురంలో పోలీసు అధికారులపై దాడి చేశారు. మద్యం తాగి గలాటా చేస్తున్న కొందరు యువకులను అడ్డుకున్న పొళియూర్ స్టేషన్ ఎస్ఐనీ కొట్టారు.

click me!