
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేసే ఏదైనా ప్రసంగం లేదా చర్య రాజద్రోహం కాదనీ, ప్రాథమిక హక్కులకు అనుకూలంగా అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు బుధవారం అన్నారు. ఇలాంటి వాటిని ప్రాథమిక హక్కుల్లో భాగంగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని చూస్తుంటే వ్యాఖ్యలు, విమర్శలను ప్రభుత్వం తగిన రీతిలో స్వీకరించడం లేనట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక హక్కుల వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం లేదా విమర్శించడం నేరంగా పరిగణించబడుతోందని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ సోలీ సొరాబ్జీ ప్రారంభ స్మారక ఉపన్యాసాన్ని ఇచ్చారు.
సమూహాల మధ్య ద్వేషాలు పెంపొందించే విధంగా కొంతమంది వ్యక్తులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారనీ, ఈ విషయన్ని ప్రభుత్వాలు గమనించాల్సిన ఉందనీ, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్‌లను సవరించే ప్రతిపాదన ఉందని అన్నారు. ప్రజా ప్రయోజనాలను, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాతో జోక్యం చేసుకోవడం, ఇంటర్నెట్ సేవల నిలిపివేతలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.
దేశంలోని పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సుప్రీంకోర్టు పౌరులకు గుర్తుచేస్తోందని న్యాయమూర్తి అన్నారు. రాజకీయ హక్కులపై ప్రజల్లో అవగాహన లేకపోయినా, చర్చలు జరగకపోయినా చెప్పుకోదగిన ప్రజాస్వామ్యం అంటూ ఉండదని చెప్పారు. పౌరులకు రాజకీయ హక్కుల అవగాహన ఉంటేనే.. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా నడుస్తుందని అన్నారు. ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్య్రంపై సుప్రీం కోర్టు వివిధ తీర్పుల్లో ప్రతి వ్యక్తి సమస్యలను బహిరంగంగా చర్చించే అవకాశం కల్పించాలని, మన దేశంలో నిజం బయటకు రావాలంటే చర్చ ద్వారానే జరుగుతుందని జస్టిస్ రావు అన్నారు.
దేశ సమస్యలు, విధానాలపై బహిరంగంగా చర్చించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందని, ఈ ప్రాథమిక హక్కును సుప్రీంకోర్టు ప్రతిసారీ కాపాడుతోందని తెలిపారు. ప్రాథమిక హక్కులు ప్రజలతో వీడదీయలేనివని, ప్రభుత్వ అధికారాలకు బ్రేకులు వేసేవని వివరించారు. ప్రాథమిక హక్కుల పరిధిని పెంపొందించడంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ రాజద్రోహం కేసులు పెడుతోందని అన్నారు.
వాక్ స్వాతంత్య్రంలో మూడు అంశాలు ఉంటాయనీ, చర్చ, వాదనలు, ప్రేరేపణ. చర్చలు, వాదనలపై ప్రభుత్వానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ ప్రేరేపణ అన్న అంశం దగ్గర శాంతి భద్రతలు, పరువు నష్టం అన్న కారణాలు చూపించి ఆంక్షలు పెడుతుంద’’ని విశ్లేషించారు. ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యంపై పరిమితి విధించవచ్చు, వాటిలో ఒకటి రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, పరువు నష్టం మొదలైనవి ఉంటాయని తెలిపారు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66Aకి సంబంధించి అభ్యంతరకరమైన ప్రసంగానికి మూడేళ్ల జైలు శిక్ష విధించే విధంగా వ్యవహరించే వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుల్లో ఒకదానిపై కూడా ఆయన చర్చించారు.