Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. వ‌రుసగా చ‌నిపోతున్న అడవి పందులు.. వ్యాధి లక్షణాలు ఇవే!

By Rajesh KFirst Published Jul 1, 2022, 5:52 AM IST
Highlights

Anthrax : కేరళలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని ప‌లు వ్యాధులు ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా ఆంత్రాక్స్ వ్యాధి భయాందోళ‌న‌కు గురిచేస్తుంది. ఈ వ్యాధి కారణంగా అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులు చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. 

Anthrax: కేరళలో ఆంత్రాక్స్ వ్యాధి  కలకలం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే.. నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి అంటు వ్యాధులతో స‌త‌మ‌త‌వుతున్నకేర‌ళ‌లో తాజాగా ఆంత్రాక్స్ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి  ప్రబలడంతో రాష్ట్ర‌వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. 

రాష్ట్రంలోని అతిరపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఐదు నుంచి ఆరు వరకు అడవి పందులు
ఆంత్రాక్స్‌ వ్యాధి ల‌క్షణాల‌తో చనిపోయిన‌ట్టు స్థానిక అధికారులు గుర్తించారు. అడవి పందుల కళేబరాలను పరిశీలిస్తే.. బాసిల్లస్ ఆంత్రాసిస్ జాడలు కనిపించాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీనిపై ఆరోగ్యశాఖ, పశుసంవర్ధకశాఖ, అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ కేసును నిర్ధారించడానికి వారి నమూనాలను పరీక్షించారు.

ఆంత్రాక్స్ అంటే ఏమిటి?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం..ఆంత్రాక్స్‌ అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. గ్రామ్-పాజిటివ్, రాడ్-ఆకారపు బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అంటు వ్యాధి. ఇది సహజంగా మట్టిలో పుడుతుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులను, అడవి జంతువులను ప్రభావితం చేస్తుంది.
 
 ఆంత్రాక్స్‌తో మ‌నుషులు ఎలా ప్రభావితమవుతారు?

ఆంత్రాక్స్ వ్యాధి సోకిన జంతువుల మాంసం తింటే.. మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంది. ఆంత్రాక్స్ బీజాంశం శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. అవి చురుకుగా మారుతాయని CDC పేర్కొంది. బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌గానే.. అంతటా వ్యాపించి, విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా శ్వాస ద్వారా, కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

కేరళలో ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది?

ఆంత్రాక్స్ కారణంగా కొన్ని అడవి పందులు చనిపోవడం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేరళ ప్రభుత్వం క‌ఠిన‌ చర్యలు తీసుకున్నందున ప్రజలు దాని గురించి ఆందోళన చెందవద్దని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదని CDC చెప్పింది, అంటే.. సాధార‌ణంగా  జలుబు లేదా ఫ్లూ వంటివి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వ్యాధి చెందుతాయి. 

ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలివే..

సాధారణంగా ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే బయటపడతాయని వైద్య నిపుణలు తెలిపారు. ఈ వ్యాధి బారిన ప‌డిన‌వారిలో  జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాసకోస ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణానికే ప్ర‌మాదం వాటిల్ల‌వ‌చ్చని హెచ్చరిస్తున్నారు.  

click me!