తమిళనాడులో మరో లాకప్ డెత్.. రెండు నెలల్లో రెండో కేసు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

By Mahesh KFirst Published Jun 13, 2022, 2:14 PM IST
Highlights

తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. రెండు నెలల్లో ఇది రెండో కేసు. రాజశేఖర్ అనే వ్యక్తిని శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. మరుసటి రోజే ఆ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.

చెన్నై: తమిళనాడులో మరో లాకప్ డెత్ జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే రెండో లాకప్ డెత్ ఘటన జరగడం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. ఆదివారం సాయంత్రం చెన్నైలో పోలీసు కస్టడీలో 30 ఏళ్ల వ్యక్తి మరణించాడు. దీనిపై ప్రతిపక్షాలు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

కొడుంగయ్యూర్ పోలీసులు శనివారం రాజశేఖర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనపై సుమారు 20 నేరపూరిత కేసులు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు వివరాల ప్రకారం, రాజశేఖర్ తిరవల్లూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. రాజశేఖర్ తన నేరాలను అంగీకరించాడు. ఆ తర్వాత రాజశేఖర్ తన ఒంట్లో నలతగా ఉన్నదని చెప్పడంతో హాస్పిటల్ తీసుకెళ్లామని పోలీసులు చెప్పారు.

హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత రాజశేఖర్ ఆరోగ్యం మళ్లీ కుదుటపడిందని వివరించారు. ఆ తర్వాత మళ్లీ పోలీసు స్టేషన్‌కు తెచ్చినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన తర్వాత మళ్లీ ఆయనలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. దీంతో మళ్లీ ఆయనను గవర్నమెంట్ స్టాన్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని, కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే యాక్షన్‌ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు చెన్నై అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసు టీ ఎస్ అంబు వెల్లడించారు.

రాజశేఖర్ మరణంపై వెంటనే విచారించాలని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు సీబీ సీఐడీని ఆదేశించారు.

కాగా, ప్రతిపక్ష నేత, మాజీ సీఎఎం పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఈ ఘటనపై వెంటనే హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

‘తమిళనాడులో మరో లాకప్ డెత్ జరిగింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో లాకప్ డెత్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ లాకప్ మరణాలను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డీఎంకే ప్రభుత్వం హయాంలో జరిగిన లాకప్ మరణాలపై న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ పళని స్వామి ఫైర్ అయ్యారు.

ఏప్రిల్ నెలలో 25 ఏళ్ల వీ విగ్నేష్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఉన్నాయని ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాతి రోజే ఆయన మరణించినట్టు ప్రకటించారు. విగ్నేష్ మృతదేహంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అనంతరం, హత్యా నేరం అభియోగాల కింద ఆరుగురు పోలీసులను అరెస్టు చేశారు.

click me!