
న్యూఢిల్లీ: ఒంటరిగా ఉన్నవారు జంట కోసం డేటింగ్ యాప్‌లలో అకౌంట్ తీసుకుంటారు. జంట కట్టి ఒంటరితనాన్ని వదిలిపెట్టుకుంటారు. కానీ, ఈ డేటింగ్ యాప్‌లు చాలా నేరాలకు వేదికలు కూడా అవుతున్నాయి. లైంగికదాడులు.. ఆర్థిక నేరాలు కూడా ఈ యాప్‌లతో విరివిగా జరుగుతుంటాయి. కానీ, కేరళకు చెందని ఓ యువకుడు ఇలాంటి ఓ డేటింగ్ యాప్‌ను వినియోగించిన తీరుకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఆశ్చర్యపోతుంటే.. ఇంకొందరు శభాష్ అంటున్నారు.
ఆ కేరళ వ్యక్తి కొత్తగా మహారాష్టకు షిఫ్ట్ అయ్యాడు. అది ముంబయి మహా నగరానికి వెళ్లాడు. కానీ, హిందీ భాష రాదు. ఆ మహానగరంలో బ్రోకర్ల సహాయం లేకుండా అదీ హిందీ భాష రాకుండా అద్దె ఇల్లును వెతకడం సవాళ్లతో స్వారీ చేయడం వంటిదే. అందుకే.. ఆ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. వేగంగా స్పందన రావాలని, తన సమస్యకూ పరిష్కారం దొరకాలని ఆయన డేటింగ్ యాప్ బంబుల్‌ను ఎంచుకున్నాడు.
అందులో తన బయోను సేపోయో సెక్సువల్ కాదని జోవియల్‌గా రాసుకున్నాడు. ముంబయిలో ఓ ఫ్లాట్ కోసం వెతుకుతున్నానని పేర్కొన్నాడు. అంతేకాదు.. ముంబయిలో ఉండి ముంబయిలో వెస్ట్రన్ లైన్‌లో అద్దెకు వెతకడంలో తనకు సహాయ పడటానికి సిద్ధంగా ఉంటే రైట్ స్వైప్ చేయాలని కోరాడు.
అలాగే.. తన హృదయాన్ని వేగంగా చేరడానికి దారి ఇదీ అనే కాలమ్‌లో ఆంధేరీలో బ్రోకరేజ్ లేని ప్రాపర్టీలను వెతకడం ద్వారా అది సాధ్యం అని పేర్కొన్నాడు. ఒక వేళ బ్రోకరేజీ కోసం అడిగినా.. తాను అలాంటి వారిని జడ్జ్ చేయబోనని తెలిపాడు.
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు తీసి ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ ట్వీట్ వైరల్ అయింది. చాలా మంది ఆ ట్వీట్లకు తమ శైలిలో కామెంట్లు విసిరారు. బంబుల్‌లో మీరు సోల్ మేట్ కోసం వెతుకున్నారా? ఓ నో.. ఆ వ్యక్తి బొంబాయ్‌లో రెంట్ కోసం వెతుకుతున్నాడు అంటు కామెంట్ ఆ వ్యక్తి స్క్రీన్ షాట్లను జోడించాడు.
మరొకరు ముంబయిలై అద్దె గదిని వెతకడం ఎంత కష్టంతో కూడుకున్నదో పరోక్షంగా చెబుతూ.. తాను బొంబాయ్‌లో ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నారని, ఆయన తీరును వంద శాతం గౌరవిస్తానని కామెంట్ చేశారు. బొంబాయ్‌లో రెంట్ కోసం ప్రజలు ఎంత కష్టపడుతున్నారో.. ఇన్ని చేయాల్సి ఉంటుందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇంకొకరు తాను బంబుల్ ప్రొఫైల్‌ను తప్పుగా ఉపయోగిస్తున్నానా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా అంటూ వ్యంగ్యం చేశారు. ఇలాంటి విచిత్రాలను చూడటానికి అప్పుడప్పుడు బంబుల్, టిండర్‌లో అకౌంట్ తీసుకుని తీర్సాలిందేనని అనిపిస్తుందని మరొకరు ట్వీట్ చేశారు.