ఢిల్లీ లిక్కర్ స్కాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అన్నా హాజారే లేఖ

By narsimha lodeFirst Published Aug 30, 2022, 1:27 PM IST
Highlights

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజారే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మంగళవారం నాడు లేఖ రాశారు. ఢిల్లీ మద్యం పాలసీని ఆయన తప్పుబట్టారు. మద్యం పాలసీ ప్రజలకు నష్టం చేసేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహాజరే మంగళవారం నాడు లేఖ రాశారు.ఢిల్లీలోన మద్యం దుకాణాలను మూసివేయాలని ఆ లేఖలో ఆయన కోరారు.
ఢిల్లీలో ప్రభుత్వ పాలసీపై వస్తున్న వార్తలు చదువుతున్నందుకు తనకు బాధగా ఉందన్నారు. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం చోటు చేసుకుందని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు  సోదాలు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ పెద్ద కుటుంబ సభ్యుల పాత్ర ఉందని కూడా బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అన్నా హాజారే కేజ్రీవాల్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

స్వరాజ్ అనే పుస్తకంలో మీరు అనేక విషయాలను ప్రస్తావించారని కేజ్రీవాల్ ను ఉద్దేశించి  అన్నాహాజారే చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అయిన తర్వాత  మీరు మీ ఆదర్శ భావజాలాన్ని మర్చిపోయినట్టుగా కన్పిస్తుందని అన్నా హాజారే అభిప్రాయపడ్డారు. మద్యం మత్తు ఎలా ఉంటుందో అధికారం అనే మత్తు కూడా అలానే ఉంటుందన్నారు. మీరు కూడా ఈ మత్తులో మునిగిపోయారనే అనుమానం కలుగుతుందని అన్నా హాజారే అభిప్రాయపడ్డారు.ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని అన్నా హాజారే విమర్శించారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆదర్శాలను మరిచిపోయినట్టుగా కన్పిస్తుందన్నారు. ఈ కారణంగానే ఢిల్లీలో మీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని అన్నా హాజారే పేర్కొన్నారు.  కొత్త ఎక్సైజ్ విధానం ద్వారా మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉందన్నారు. కొత్త మద్యం దుకానాలు తెరుచుకొనే వెసులుబాటు కూడా కలిగిందన్నారు. ఈ విధానం ద్వారా అవినీతికి తెర తీసే అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానం ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదని అన్నా హాజారే ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
దేశంలో ఇంత తప్పుడు మద్యపాన విధానం ఎక్కడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై  భావసారూప్యత కలిగిన వ్యక్తులు ఒత్తిడి చేస్తే ప్రయోజనం కలిగేదన్నారు. కానీ దీనికి భిన్నంగా పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఢిల్లీ సర్కార్ తీసుకు వచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపైఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ  విధానం ద్వారా పార్టీకి సన్నిహితులైన వారు లబ్దిపొందారని ఆరోపించారు. 

 


 

click me!