
సూపర్ మార్కెట్లు (super markets), వాక్‌ఇన్ స్టోర్ల (walk in stores)లో వైన్ విక్రయానికి అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త అన్నా హాజరే (Anna Hazare) నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ నిరసన కార్యక్రమం ప్రారంభమవుతుందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ విషయంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray)కు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (ajit pawar)కు లేఖ రాశారు. వెంటనే కొత్త మద్యం విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన అందులో కోరారు.
“సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్మకాలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి, ప్రజల సంక్షేమానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తన విధానానికే కట్టుబడి ఉంటే నిరవధిక సమ్మెకు దిగుతాను ’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన మొదటి సారిగా సీఎంకు లేఖ రాశారు. అయితే ఆ లేఖకు ప్రభుత్వం తరుఫున ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆయన నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అన్నా హజారే తన గ్రామమైన రాలేగావ్ సిద్ది (ralegon siddhi) లో దశాబ్దాలుగా డీ అడిక్షన్ (de adiciton) ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను మహారాష్ట్ర మంత్రివర్గం జనవరి 27వ తేదీన ఆమోదించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. 1,000 చదరపు అడుగుల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్ లు, దుకాణాలు ‘మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (maharastra shops and establishment act) ’ కింద “షెల్ఫ్-ఇన్-షాప్ (shelf-in-shop)” పద్ధతిని అవలంబించవచ్చు. అంటే ప్రజలు నేరుగా ఆయా షాప్ లకు వచ్చి వైన్ కొనుగోలు తీసుకొని వెళ్లిపోవచ్చు. అక్కడే తాగడానికి అనుమతి ఉండదు. అయితే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థల సమీపంలోని సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయించడానికి అనుమతి లేదు. మద్య నిషేదం అమలుల్లో ఉన్న జిల్లాల్లో ఈ వైన్ అమ్మకాలకు అనుమతి ఉండదని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే వైన్ విక్రయించాలని భావించే సూపర్ మార్కెట్లు లైసెన్స్ (licence) కోసం ఏడాదికి రూ.5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఎంవీఏ మహారాష్ట్రను 'మద్య రాష్ట్ర'గా మారుస్తోంది : బీజేపీ
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్ష బీజేపీ (bjp) కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మహారాష్ట్రను మద్య రాష్ట గా చేయాలని చూస్తోందని ఆరోపిస్తోంది. ఈ విషయంలో గతంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ (devendra padnavees) స్పందించారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘‘మద్య-రాష్ట్ర (మద్యం రాష్ట్రం)’’ గా మార్చాలని చూస్తోందని తీవ్రంగా విమర్శించారు. కొత్తగా మద్యం ఫ్యాక్టరీలు, మద్యం ఏజెన్సీలను ప్రారంభించిన వారితో ప్రభుత్వ పెద్దలు డీల్ కుదుర్చుకున్నారని అన్నారు. అందుకే పారిశ్రామికవేత్తల వ్యాపార ప్రయోజనాలను సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.