అవినీతి ఆరోపణలు.. అనిల్ దేశ్ ముఖ్ షాకింగ్ నిర్ణయం, సీఎం కి లేఖ

By telugu news teamFirst Published Mar 25, 2021, 8:32 AM IST
Highlights

ఈ విషయంలో అనిల్ దేశ్ ముఖ్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయించండి అంటూ... ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి లేఖ రాశారు. 

మహారాష్ట్ర హోం మినిష్టర్ అనిల్ దేశ్ ముఖ్  పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటన మహా రాజకీయంలో తీవ్ర కలకలం రేపింది. అయితే... ఈ విషయంలో అనిల్ దేశ్ ముఖ్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయించండి అంటూ... ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి లేఖ రాశారు. ఈ మేరకు అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.

‘‘ తనపై మాజీ పోలీసు అధికారి పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని తాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని కోరాను’’ అంటూ ట్వీట్ చేశారు.  

కొద్ది రోజుల క్రితం మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ .. సీఎం ఉద్దవ్ ఠాక్రేకి లేఖ రాశారు. అందులో.. అనిల్ దేశ్ ముఖ్ అవినీతికి పాల్పడ్డారంటూ పేర్కొన్నారు.  . పరమ్ బీర్ సింగ్ తన లేఖలో.. అనిల్ దేశ్ ముఖ్ అవినీతి గురించి ఎన్సీపీలోని కొందరు నేతలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. దీంతో ఎన్సీపీలో కూడా మెల్లగా దుమారం మొదలైంది.   

ముకేశ్ అంబానీ ఇంటివద్ద వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ని కనుగొనడం, ఈ  ఉదంతంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. .. అనిల్ దేశ్ ముఖ్ తనకు 100 కోట్ల టార్గెట్ పెట్టారంటూ సచిన్ వాజే నాతో చెప్పారని  పరమ్ బీర్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.   

ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్  రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే ఈ ఆరోపణలు నిరాధారాలని అనిల్ కొట్టి పారేశారు. తనను ఈ కేసు నుంచి రక్షించుకునేందుకే సింగ్ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. అయితే... అవినీతి ఆరోపణలు మరింత దుమారం రేపుతుండటంతో.. అనిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. మరి దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి. 


 

click me!