రాఫెల్ స్కాం: సుప్రీం తీర్పుపై అనిల్ అంబానీ కామెంట్స్

By sivanagaprasad kodatiFirst Published Dec 14, 2018, 1:41 PM IST
Highlights

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ స్వాగతించారు. ఈ ఒప్పందం విషయంలో తన కంపెనీపై అసత్య ఆరోపణలు చేసినట్లు ఈ తర్పు ద్వారా రుజువైందని అంబానీ అన్నారు. 

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ స్వాగతించారు. ఈ ఒప్పందం విషయంలో తన కంపెనీపై అసత్య ఆరోపణలు చేసినట్లు ఈ తర్పు ద్వారా రుజువైందని అంబానీ అన్నారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నా అన్నారు. తనపైనా, రిలయన్స్ గ్రూప్‌పైనా చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని న్యాయస్థానంలోనే తేలిందన్నారు.

దేశ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని..కీలకమైన రక్షణ రంగంలో ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా విధానాలకు రిలయన్స్ ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటుందని అనిల్ అంబానీ స్పష్టం చేశారు.

ఫ్రాన్స్ నుంచి అత్యాధునికమైన 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆ దేశానికి చెందిన ‘‘డసో ఏవియేషన్’’తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా భారత్‌లో తన విదేశీ భాగస్వామిగా అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకుంటున్నట్లు డసో ఏవియేషన్ ప్రకటించింది.

అయితే రిలయన్స్ పేరును డసో ఏవియేషన్‌కు భారత ప్రభుత్వమే కేటాయించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ సంచలన వ్యాఖ్యలు చేయడం భారత్‌లో దుమారాన్ని రేపింది. దీంతో రాఫెల్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. దీనిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మరోవైపు రాఫెల్ కుంభకోణంపై ప్రత్యేక విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాఫెల్ డీల్, ధరల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు అనుమానించదగ్గ విషయాలేవీ లేవని అభిప్రాయపడింది. ఒప్పందం వల్ల ఏ ప్రైవేట్ సంస్థకు వాణిజ్యపరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. 

click me!