ఇక ఓట్ ఫ్రమ్ హోమ్.. త్రిపురలో మొదటి సారిగా ప్రవేశపెట్టనున్న ఎన్నికల కమిషన్.. సీనియర్ సిటిజన్లకు అవకాశం..

By team teluguFirst Published Jan 19, 2023, 10:07 AM IST
Highlights

వర్క్ ఫ్రమ్ హోం అంటే మనందరికీ తెలుసు. కానీ ఇక నుంచి ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే కూడా తెలియనుంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ కొత్త విధానం తీసుకొచ్చింది. దీనిని మొదటి సారిగా త్రిపురలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 

ఎన్నికల కమిషన్ తన విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న కొన్ని మూస పద్దతులకు స్వస్తి పలుకుతోంది. అందులో భాగంగానే కొన్ని సంవత్సరాల కిందట బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం మిషన్లను తీసుకొచ్చింది. ఇవి విజయవంతంగా పని చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు మరో కొత్త సంస్కరణను తీసుకొచ్చింది. అదే ‘ఓట్ ఫ్రమ్ హోమ్’. 

ఇంత వరకు ప్రతీ ఒక్క ఓటరు సంబంధిత పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసే పద్దతే కొనసాగుతోంది. ఓటరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఓటరు అనారోగ్యంతో బాధపడుతున్నా, వృధాప్యం వల్ల నడవలేని స్థితిలో ఉన్నా, వికలాంగులైనా పోలింగ్ బూత్ కు రావాల్సిందే. కానీ ఇలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ కొత్త ఆలోచన చేసింది. అలాంటి ఓటర్లు  తమ ఓటు హక్కును ఇంటి నుంచే ఉపయోగించుకునేందుకు వీలు కల్పించేలా కొత్త పద్దతిని తీసుకొచ్చింది. 

ఈ పద్దతిని దేశంలో మొట్టమొదటి సారిగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) బుధవారం స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ అంశాన్ని త్రిపుర సీఈవో మీడియాకు తెలియజేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం ఉంటుందని ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు దీనిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 

ఈ సందర్భంగా పలు విషయాలను త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాలు (సీఏపీఎఫ్) ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్, నైట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘అవసరమైన సంఖ్యలో కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలు (సీఏపీఎఫ్) ఇక్కడికి చేరుకున్నాయి. ఫ్లాగ్ మార్చ్, నైట్ పెట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి. మాకు న్యాయమైన, పారదర్శకమైన, శాంతియుత ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, వికలాంగులు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం ఉంటుంది.’’ అని తెలిపారు. 

కాగా.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16వ తేదీన, నాగాలాండ్, మణిపూర్‌లలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలలో మొత్తంగా 62.8 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 31.47 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 97 వేల మంది ఉన్నారు. 31,700 మంది దివ్యాంగుల ఓటర్లు ఉన్నారు. 1.76 లక్షలకు పైగా ఓటర్లు మొదటి సారిగా ఓటును ఉపయోగించుకోనున్నారు.

ఇదిలా ఉండగా.. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని, గత సారి కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని సీఎం మాణిక్ సాహా విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా బీజేపీ ఎప్పుడూ ప్రజల కోసం పని చేస్తుందని ఆయన అన్నారు. 

click me!