ఎనిమిదేళ్ల నాటి హత్య కేసు.. ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై కేసు నమోదు చేసిన సీబీఐ..

By Sumanth KanukulaFirst Published Jan 12, 2023, 10:41 AM IST
Highlights

ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై సీబీఐ హత్య కేసు నమోదు చేసింది. బీహార్‌లో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాలికా విద్యాపీఠ్‌ మాజీ కార్యదర్శి శరద్‌ చంద్ర హత్యకేసులో ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు

ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై సీబీఐ హత్య కేసు నమోదు చేసింది. బీహార్‌లో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాలికా విద్యాపీఠ్‌ మాజీ కార్యదర్శి శరద్‌ చంద్ర హత్యకేసులో ఆమ్రపాలి గ్రూప్‌ మాజీ సీఎండీ అనిల్‌ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో పాట్నా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అనిల్ శర్మతో పాటు మరికొందరు నిందితులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.. ఇదిలా ఉంటే.. అనిల్ శర్మ ఇప్పటికే అనేక బ్యాంకు మోసాల కేసులను ఎదుర్కొంటున్నారు.

 ఇక, శరద్ చంద్ర హత్యపై బీహార్‌లోని లఖిసరాయ్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తును సీబీఐ తన విధానాలకు అనుగుణంగా చేపట్టింది. ఈ కేసులో అనిల్ శర్మ, లఖిసరాయ్‌కు చెందిన ప్రవీణ్ సిన్హా, శ్యామ్ సుందర్ ప్రసాద్, రాజేంద్ర సింఘానియా, శంభు శరణ్ సింగ్, బాలికా విద్యాపీఠ్ అప్పటి ప్రిన్సిపాల్ అనితా సింగ్‌లపై హత్యానేరం కింద కేసు నమోదు చేయబడింది.

ఇక, 2014 ఆగస్టు 2న లఖిసరాయ్‌లోని బాలికా విద్యాపీఠ్‌ మాజీ కార్యదర్శి శరద్ చంద్ర తన బాల్కనీలో న్యూస్ పేపర్ చదువుతున్న సమయంలో హత్య చేయబడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు సంస్థకు చెందిన భూమి, ఆస్తులను ఆక్రమించడానికి పన్నిన నేరపూరిత కుట్రలో భాగంగా చంద్‌ను కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్నాయి.

శరద్ చంద్ర భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో.. ‘‘2009 ఆగస్టులో రాజేంద్ర ప్రసాద్ సింఘానియా, డాక్టర్ ప్రవీణ్ కుమార్ సిన్హా, శ్యామ్ సుందర్ ప్రసాద్, శంభు శరణ్ సింగ్ సహాయంతో ఆమ్రపాలి గ్రూప్ ఎండీ అనిల్ శర్మ బాలికా విద్యాపీఠ్ ట్రస్ట్‌ను లాగేసుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. మరణించిన వ్యక్తిని పదవి నుంచి బలవంతంగా తొలగించారు. అప్పటి నుంచి ఇరుపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. వ్యక్తిగత ఖాతా తెరవడం ద్వారా బాలికా విద్యాపీఠం ఆదాయాన్ని కూడా లాక్కుంటున్నారని.. ఇది సిన్హా, సింగ్‌లచే నిర్వహించబడిందని శరద్ చంద్ర ఫిర్యాదులు కూడా చేశారు. అలాగే మరణించిన వ్యక్తికి క్రమం తప్పకుండా బెదిరింపులు వచ్చాయి. దాడిలో అతని ఇల్లు దెబ్బతింది’’ అని ఉంది.

అయితే రాష్ట్ర పోలీసులు దర్యాప్తును సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ చంద్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో పెద్దగా పురోగతి లేదని బీహార్ పోలీస్ సీఐడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ 12న పాట్నా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ కేసును జనవరి 9న సీబీఐ సాధారణ కేసుగా మళ్లీ నమోదు చేసి విచారణ జరుపుతోంది.
 

click me!