బీజేపీ దాచడానికి ఏమీ లేదు.. భయపడాల్సిన పనిలేదు: అదానీ వివాదంపై విపక్షాల ఆరోపణలపై అమిత్ షా

Published : Feb 14, 2023, 12:58 PM IST
బీజేపీ దాచడానికి ఏమీ లేదు.. భయపడాల్సిన పనిలేదు: అదానీ వివాదంపై విపక్షాల ఆరోపణలపై అమిత్ షా

సారాంశం

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం, ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యూమెంటరీలపై ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో అధికార బీజేపీని  టార్గెట్‌గా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు.

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం, ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యూమెంటరీలపై ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో అధికార బీజేపీని  టార్గెట్‌గా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. అదానీ- హిండెన్ బర్గ్ వివాదం అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నందున తాను వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీజేపీ దాచడానికి గానీ, భయపడటానికి గానీ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ కామెంట్స్ చేశారు. ‘‘సుప్రీంకోర్టు ఈ విషయంపై దృష్టి సారించింది.. మంత్రిగా ఇప్పుడు నేను వ్యాఖ్యానించడం సరికాదు.. కానీ ఇందులో బీజేపీ దాచడానికి ఏమీ లేదు, భయపడాల్సిన పనిలేదు’’ అని అమిత్ షా పేర్కొన్నారు. 

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగం గురించి అడిగిన ప్రశ్నకు.. ఇది దాదాపు పూర్తిగా అదానీ గ్రూపుకు సంబంధించినదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఏ ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాడనేది ఆయన గానీ, ఆయన స్క్రిప్ట్ రైటర్‌లు నిర్ణయించుకోవాలని సెటైర్లు వేశారు. బీజేపీపై రాహుల్ గాంధీ చేసిన ‘క్రోనీ క్యాపిటలిజం’ ఆరోపణలపై కూడా అమిత్ షా స్పందించారు. ‘‘ప్రశ్నే లేదు. బీజేపీపై ఇప్పటి వరకు ఎవరూ అలాంటి ఆరోపణ చేయలేకపోయారు. వారి (కాంగ్రెస్) హయాంలో.. ఏజెన్సీలు కాగ్ లేదా సీబీఐ కావచ్చు.. వారి అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేశాయి. రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి’’ అని అమిత్ షా పేర్కొన్నారు. 

బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై అస్త్రంగా వాడుకుంటుందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. కోర్టులపై బీజేపీ ప్రభావంతో లేవని.. వారు కోర్టుకు వెళ్లాలని అన్నారు. ‘‘వాళ్లు కోర్టుకు ఎందుకు వెళ్లరు? పెగాసస్‌ ఇష్యూ లేవనెత్తిన సమయంలోనూ కోర్టుకు ప్రూఫ్‌లతో వెళ్లండి అని చెప్పాను.. వాళ్లకు శబ్దం సృష్టించడం మాత్రమే తెలుసు. కోర్టును ఆశ్రయించడంతో పెగాసస్‌పై తీర్పును కూడా అందించింది. విచారణ కూడా జరిగింది’’ అని అమిత్ షా అన్నారు. 

హిండెన్‌బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ నేపథ్యంలో కుట్ర ఉందా అని అడిగినప్పుడు.. ‘‘వేలాది కుట్రలు సత్యానికి హాని కలిగించవు. సత్యం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. వారు 2002 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దీనిని చేస్తున్నారు. అయితే ప్రతిసారీ ఆయన బలంగా, నిజాయితీగా.. ప్రతిసారీ ప్రజలలో మరింత ప్రజాదరణ పొందడం ద్వారా ఉద్భవించారు’’ అని అమిత్ షా చెప్పారు. 

ఇదిలా ఉంటే.. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. త్రిపురలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందన్న ప్రశ్నలకు అమిత్ షా స్పందిస్తూ.. త్రిపురలో నియోజకవర్గాలు చిన్నవని కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముందే బీజేపీ మెజారిటీ మార్కును దాటడం అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. 


ఇక, అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేవరెటిజం, క్రోనీ క్యాపిటలిజం ఆరోపణలు చేయడంతో పెద్ద రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసింది. ఇందుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడులపై వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. 

అయితే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికను అనుసరించి పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు సెబీ అంగీకరించిందని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవలి నివేదిక కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి సెబీ పూర్తిగా సన్నద్ధమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి తెలియజేశారు.

భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి కమిటీని నియమించడంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మెహతా చెప్పారు. అయితే ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో పేర్లను అందజేస్తుందని ఆయన చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్