
ఇటీవల విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. భారతీయులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మానసికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, ఆహేళన చేయడం వంటి ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా పోలాండ్ రాజధాని వార్సాలో ఇలాంటి జాత్యహంకార దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భారతీయుడిపై పోలండ్ దేశానికి చెందిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జాతి వివక్షకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ శ్వేత జాతీయుడు.. భారతీయుడి అనుమతి లేకుండా వీడియో తీస్తూ అతనిని వేధించాడు. జాతి వివక్షతో కూడిన ప్రశ్నలను అడుగుతూ.. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరిస్తున్నవని అడిగితే.. నువ్వు ఎందుకు పోలాండ్ లో ఉంటున్నావ్? మీ దేశానికి తిరిగి వెళ్లిపో.. అని బెదిరించాడు. యూరప్ కు ఎందుకు వచ్చావ్.. పరాన్నజీవుల్లా ఇతర దేశాల్లో ఎందుకు జీవిస్తున్నావ్? మీరు మా జాతిని మారణహోమం చేస్తున్నారు? నువ్వు ఆక్రమణదారుడివి. నీ దేశానికి నువ్వు వెళ్లిపో.. నువ్ ఆక్రమణదారునివి.. మీరు యూరప్‌లో ఉండడం మాకు ఇష్టం లేదు. అమెరికాలో కూడా చాలా మంది భారతీయులున్నారు. మీరు పోలాండ్‌లో ఎందుకు ఉన్నారు? మీరు పోలాండ్‌పై దాడి చేయగలరని భావిస్తున్నారా? ” అని అమెరికన్ టూరిస్ట్ అనుచితంగా ప్రవర్తించాడు. అయినా.. ఆ భారతదేశానికి చెందిన వ్యక్తి.. ఒక్క మాట కూడా అనలేదు.. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. అతని మాటలకు రెచ్చిపో లేదు.. అతని మాటలు పట్టించుకోకుండా చాలా సౌమ్యంగా వ్యవహరించారు. వీడియో రికార్డింగ్ ఆఫ్ చేయమని కోరడటం ఆ వీడియోలో చూడవచ్చు. జాత్యహంకార దూషణలు, అసభ్య పదజాలంతో నిండిన నాలుగు నిమిషాల వీడియో ఇప్పుడు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
కాగా.. గతంలో ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. మెక్సికన్ అమెరికన్ మహిళ.. నలుగురు భారతీయ మహిళలతో గొడవకు దిగింది. వారిపై జాత్యహంకార వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. మీ దేశానికి మీరు తిరిగి వెళ్లిపోవాలని రెచ్చగొట్టింది. ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారతీయ స్త్రీలను ద్వేషిస్తూ.. దుర్భాషలాండింది. ఇండియన్స్ .. బెటర్ లైఫ్ కోసమే అమెరికా వస్తారనీ, అమెరికాను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.