గుజరాత్ అల్లర్లు, పీఎం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే

By Mahesh KFirst Published Jan 24, 2023, 1:35 PM IST
Highlights

2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై అమెరికా వైఖరిని మీడియా ప్రశ్నించింది. విలేకరుల ప్రశ్నకు సమాధానంగా అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం స్పందించారు. తనకు ఆ డాక్యుమెంటరీపై పెద్దగా అవగాహన లేదని, కానీ, అమెరికా, భారత్‌ల మధ్య బలంగా ఉన్న బంధాలపై అవగాహన స్పష్టంగా ఉన్నదని వివరించారు.
 

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో చెలరేగిన అల్లర్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (అప్పుడు గుజరాత్ సీఎం)లపై ఇంగ్లాండ్‌కు చెందిన బీబీసీ ఓ డాక్యుమెంటరీ తీసింది. బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. అంతర్జాతీయంగానూ ఈ డాక్యుమెంటరీపై చర్చ మొదలైంది. తొలిగా బీబీసీ స్వదేశం ఇంగ్లాండ్ ప్రభుత్వమే డాక్యుమెంటరీలో ప్రధాని మోడీని చిత్రించిన తీరుతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. తాజాగా, అమెరికా ఈ డాక్యుమెంటరీ పై తన వైఖరి వెల్లడించింది.

అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం ఈ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు. మీడియా ప్రశ్నలకు సమాధానంగా బీబీసీ తీసిన ఇండియా: ది మోడీ కొశ్చన్ పై రియాక్ట్ అయ్యారు. ‘మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ, అమెరికా, భారత్ రెండూ ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లడానికి దోహదపడే ఉమ్మడి విలువల గురించి బాగా తెలుసు’ అని వివరించారు. 

సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌తో అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం, ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, లోతైన ప్రజా సంబంధాలను మెరుగుపరిచే మరింత బలోపేతం చేసే అంశాలు అనేకం ఉన్నాయని వివరించారు.

Also Read: ఇండియా: ది మోడీ కొశ్చన్.. ఆ బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

భారత ప్రజాస్వామ్యం ఉజ్వలమైందని పేర్కొంటూ ఉభయ దేశాలను కలిపి ఉంచే ప్రతి అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని, తమను కలిపి ఉంచే అంశాలను మరింత బలోపేతం చేసే వైపు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

అమెరికా, భారత్‌ల మధ్య భాగస్వామ్యం చాలా విలువైనదని, ఉభయ దేశాలు లోతైన సంబంధాలను కలిగి ఉన్నాయని ప్రైస్ అన్నారు. ఇరు దేశాల ప్రజాస్వామ్యాలకు ఉండే ఉమ్మడి విలువలను పంచుకుంటాయని తెలిపారు.

అయితే, మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి తనకు అవగాహన లేదని అన్నారు. స్థూలంగా చెప్పాలంటే ఈ ఉభయ దేశాల అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలు అనేకం ఉన్నాయని వివరించారు.

గతంలో అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోడీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంగా అతడిని అమెరికాలోకి రానివ్వలేదు. కానీ, నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో ఈ బ్యాన్‌ను అమెరికా ఎత్తేసిన విషయం విధితమే.

click me!